పట్టు చీరలపై మొండి మరకలను ఇలా ఈజీగా తొలగించొచ్చు తెలుసా?
పట్టు చీరలు ఎంత అందంగా ఉన్నా.. ఒక్క మరక పడితే చాలు దాన్ని పక్కన పెట్టేస్తుంటారు చాలామంది. పట్టుచీరలు ఎంత ప్రత్యేకమైనవో.. అంత ఖరీదైనవి కూడా. మరి అలాంటి వాటిని మరకలు పడ్డాయని పక్కన పెట్టేస్తే ఎలా? ఈ సింపుల్ ట్రిక్స్ తో ఇంట్లోనే మరకలను ఈజీగా పొగొట్టవచ్చు. ఓ సారి చూసేయండి.

పట్టు చీరలను ఇష్టపడని ఆడవాళ్లు ఎవరుంటారు చెప్పండి. ఇవి ఎంత బాగుంటాయో.. అంత విలువైనవి కూడా. కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. అయితే పట్టుచీరలపై చిన్న మరక పడినా వెంటనే తెలిసిపోతుంది. కొన్ని మరకలు పోవు కూడా. చీరపై మరక చూసినప్పుడల్లా ఆ పట్టు చీర కట్టుకోలేకపోతున్నామని బాధగా ఉంటుంది. మరి అలాంటి మొండి మరకలను సులభంగా ఎలా తొలగించాలో ఇక్కడ చూద్దాం.
పట్టు చీరలపై నూనె మరకలా?
పట్టు చీరలు ఎక్కువగా పూజలు, ప్రత్యేక సందర్భాల్లో కట్టుకుంటారు. పూజల్లో అయితే నూనె చుక్కలు పడటం సహజమే. దాని గురించి బాధపడకండి. నూనె మరక పడిన వెంటనే తడవని శుభ్రమైన కాటన్ బట్టతో ఆ ప్రదేశంలో అద్దాలి. గుడ్డ లేకపోతే టిష్యు పేపర్ తో నూనె పడిన చోట అద్దవచ్చు. ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. మరక పడిన చోట గట్టిగా రుద్దకూడదు. అలా రుద్దితే మిగతా చోట్లకు వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి నూనె పడిన చోట మాత్రమే మెల్లగా అద్ది మరకను తొలగించాలి.
ఇలా చేస్తే నూనె పీల్చుకుని ఆ ప్రదేశంలో మరకలు పోవడం మొదలవుతుంది. ఇలా క్లాత్ లేదా టిష్యూ పేపర్ తో అద్దిన తర్వాత అక్కడ పౌడర్ చల్లి శుభ్రం చేయాలి. పౌడర్ చల్లి మరక పడిన చోట నీటిలో కడిగితే చాలు. పేరుకుపోయిన నూనె, మురికి అంతా పోతుంది. పొరపాటున కూడా వేడి నీటితో మరకలను తొలగించడానికి ప్రయత్నించవద్దు. వేడి నీరు పడితే మరక పోనే పోదు.
లిక్విడ్ సోప్
సబ్బు ద్రావణంతో కూడా పట్టు చీరపై ఉన్న మరకలను తొలగించవచ్చు. దీని కోసం గట్టి సబ్బును ఉపయోగించకుండా సున్నితంగా ఉండే లిక్విడ్ సోప్ లను ఉపయోగించవచ్చు. లిక్విడ్ సోప్ ను చల్లటి నీటిలో కలిపి శుభ్రమైన కాటన్ గుడ్డను అందులో ముంచాలి. మొండి మరకపై మెల్లగా రుద్దాలి.
వేగంగా లేదా గట్టిగా రుద్దితే పట్టు చీరలోని దారాలు తెగిపోయే అవకాశం ఉంది. కాబట్టి మెల్లగా రుద్దాలి. తర్వాత ఆ నురుగును తొలగించడానికి మరక ఉన్న చోట చల్లటి నీటితో కడగాలి. మరక పోయి చీర పాత స్థితికి వచ్చేస్తుంది. ఈ రెండు పద్ధతుల్లో పట్టు చీరలపై ఉన్న మరకలను సులభంగా తొలగించవచ్చు. కానీ ఓపికగా చేయడం చాలా అవసరం.

