Asianet News TeluguAsianet News Telugu

దోమల వల్ల మనిషి ప్రాణాలు పోయే ఐదు రకాల వ్యాధులు

దోమ.. చూడటానికి చిన్న ప్రాణిలాగే కనిపించినా ఆదమరిస్తే దీని వల్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లడం ఖాయం. సీజన్ మారే సమయంలో అనేక వ్యాధులు మనిషి ఆరోగ్యంపై పెను ప్రభావాన్ని చూపిస్తాయి

diseases from mosquitoes
Author
Hyderabad, First Published Aug 3, 2018, 5:43 PM IST

దోమ.. చూడటానికి చిన్న ప్రాణిలాగే కనిపించినా ఆదమరిస్తే దీని వల్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లడం ఖాయం. సీజన్ మారే సమయంలో అనేక వ్యాధులు మనిషి ఆరోగ్యంపై పెను ప్రభావాన్ని చూపిస్తాయి. వర్షాకాలం వ్యాధుల కాలం..  వాతావరణంలో మార్పులతో గాలి, నీటి ప్రభావం మనిషిపై తీవ్రంగా  కనిపిస్తుంది. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో దోమలు వ్యాప్తి చెండానికి అనువైన వాతావరణం ఏర్పడుతుంది..

నీరు నిల్వ ఉండే చోట.. అపరిశుభ్ర వాతావరణంలో దోమలు నివాసాలను ఏర్పరచుకుని తమ సంతతిని వృద్ధి చేసుకుంటాయి. దోమల్లో వేలాది రకాలున్నప్పటికీ కేవలం ఐదారు రకాల దోమలే మనిషి పాలిట ప్రాణాంతకంగా మారుతున్నాయి. దోమలు కుట్టడం వల్ల డెంగీ, మలేరియా, చికెన్ గున్యా, మెదడువాపు వ్యాధి, పైలేరియా వంటి వ్యాధులు సోకి మనిషి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. 

1. మలేరియా:
ఆడ అనాఫిలీస్ అనే దోమ కుట్టడం వల్ల మలేరియా వ్యాధి సోకుతుంది. మలేరియాతో బాధపడుతున్న రోగిని దోమ కుట్టడం వల్ల దాని కడుపులోకి వ్యాధికారక పరాన్నజీవి ప్రవేశించి అక్కడ పెరుగుతుంది. ఇదే దోమ మరో వ్యక్తిని కుట్టినప్పుడు ఆ వ్యక్తి రక్తంలోకి చేరి మలేరియాకు కారణమవుతుంది. చలి, వణుకుతో జ్వరం రావడం.. శరీర ఉష్ణోగ్రత పెరగడం.. జ్వరం వస్తూ, పోతూ ఉండటం మలేరియా వ్యాధి లక్షణాలు..

2. డెంగ్యూ:
పగటి సమయంలో కుట్టే యెడీస్ అనే ఆడ దోమల ద్వారా డెంగ్యూ వ్యాధి సంక్రమిస్తుంది. ఇది సాధారణ వైరస్ జ్వరం, ఎముకలు, కండరాలు, కీళ్లనొప్పులతో జ్వరం ఉంటుంది. కళ్లనొప్పి, శరీరంపై చిన్న చిన్న దద్దుర్లతో పాటు రక్తంలో ప్లేట్‌లెట్స్ తగ్గిపోతాయి. 

3. మెదడువాపు:
క్యూలెక్స్ అనే ఆడ దోమ కుట్టడం వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. జపనీస్ ఎన్‌సెఫలైటీస్ వైరస్ ద్వారా వ్యాపిస్తుంది. ఉన్నట్లుండి జ్వరం రావడం, విపరీతమైన తలనొప్పి, వాంతులు, అపస్మారక స్థితిలోకి వెళ్లడం, శరీరంలో ఏదో ఒక అవయవం పక్షవాతానికి గురికావడం, ఫిట్ ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. ఎక్కువగా 2 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లల్లో ఈ వ్యాధి వస్తుంది.

4. చికెన్ గున్యా:
ఏడిస్ అనే దోమల వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. తలనొప్పి, వాంతులు, వికారంతో  పాటు హఠాత్తుగా జ్వరం, కీళ్ల  నొప్పులు, సరిగా నిలబడలేకపోవడం ఈ వ్యాధి లక్షణాలు

5. పైలేరియా (బోధకాలు)
క్యూలెక్స్ దోమ ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. శరీరంలోని ఏ భాగానికైనా బోధకాలు సోకుతుంది.. తరచూ జ్వరం, చంకల్లో, గజ్జల్లో బిల్లలు కట్టడం, వెన్నుపాము దగ్గరి నుంచి అన్ని అవయవాలకు వాపు, కాళ్లు, చేతులు, స్థనాలు, వరిబీజము, బుడ్డ, జ్ఞానేంద్రియాలు పాడవటం జరుగుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios