ఎండాకాలంలో రోజూ స్విమ్మింగ్ చేసేవారు చాలా మందే ఉన్నారు. కానీ రోజూ స్విమ్మింగ్ చేస్తే జుట్టు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే స్విమ్మింగ్ చేసేటప్పుడు కొన్ని చిట్కాలను తప్పకుండా ఫాలో అవ్వాలి. 

స్విమ్మింగ్ కూడా వ్యాయామమే. దీనివల్ల శరీర బరువు తగ్గుతుంది. రోజంతా చురుగ్గా ఉంటారు. బాడీ ఫిట్ గా మారడంతో పాటుగా ఎన్నో లాభాలున్నాయి. కానీ రోజూ స్విమ్మింగ్ చేస్తే జుట్టు దెబ్బతింటుంది. క్లోరిన్, ఉప్పునీరు జుట్టును నాశనం చేస్తతాయి. రోజూ స్విమ్మింగ్ చేయడం వల్ల జుట్టు పొడిగా, పెళుసుగా మారుతుంది. అయితే కొన్ని సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ తో ఈత కొట్టేటప్పుడు జుట్టును జాగ్రత్తగా చూసుకొని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచుకోవచ్చు. స్విమ్మింగ్ చేసేటప్పుడు జుట్టును ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

జుట్టును తడపండి

స్విమ్మింగ్ చేయడానికి ముందు మీ జుట్టును మంచి నీటితో బాగా తడపండి. దీనివల్ల మీ జుట్టు ఎక్కువ క్లోరిన్ లేదా ఉప్పునీటిని గ్రహించకుండా ఉంటుంది. దీనివల్ల మీ జుట్టు పొడిబారే అవకాశమే ఉండదు. 

స్విమ్మింగ్ క్యాప్

స్విమ్మింగ్ క్యాప్ ధరించడం వల్ల క్లోరిన్, ఉప్పునీటి నుంచి మీ జుట్టును రక్షించొచచ్చు. అంతేకాదు మీరు ఈత కొట్టేటప్పుడు మీ జుట్టు మీకు ఎలాంటి ఆటంకం కూడా కలిగించదు. అంటే కళ్లపై పడే అవకాశమే ఉండదు. స్విమ్ క్యాప్ లో ఎలా కనిపిస్తామో అని అనుకుంటే.. మార్కెట్లో ఎన్నో స్టైలిష్, ట్రెండీ స్విమ్ క్యాప్ లు లభిస్తాయి. వాటిని కొనండి. అందులో మీరు అందంగా కనిపిస్తారు. 

స్విమ్మింగ్ తర్వాత జుట్టును కడగడం

స్విమ్మింగ్ చేసిన తర్వాత మీ జుట్టును ఖచ్చితంగా మంచి నీళ్లతో బాగా కడగాలి. ఎందుకంటే ఈ మంచినీళ్లు మీ జుట్టులో పేరుకుపోయిన క్లోరిన్ లేదా ఉప్పునీటిని తొలగించడానికి సహాయపడతాయి. జుట్టు దెబ్బతినకూడదంటే మీరు ఈతకొట్టిన తర్వాత వీలైనంత తొందరగా జుట్టును మంచినీళ్లతో కడగాలి. 

క్లారిఫికేషన్ షాంపూ 

ఈతకొట్టడం వల్ల క్లోరిన్, ఉప్పునీరు మీ జుట్టులో బాగా పేరుకుపోతాయి. దీనివల్ల మీ జుట్టు నీరసంగా, నిర్జీవంగా కనిపిస్తుంది. వారానికి ఒకసారి షాంపూను ఉపయోగించడం వల్ల మీ జుట్టు తిరిగి అందంగా మారుతుంది. ఆరోగ్యంగా కూడా కనిపిస్తుంది. అయితే షాంపూ బాటిల్ పై ఉన్న సూచనలను ఖచ్చితంగా పాటించండి. అలాగే జుట్టును బాగా కడగండి. 

డీప్ కండిషన్ 

క్లోరిన్, ఉప్పునీరు మీ జుట్టు నుంచి సహజ నూనెలను తొలగిస్తుంది. దీంతో మీ జుట్టు పొడిగా, పెళుసుగా మారుతుంది. వారానికి ఒకసారి మీ జుట్టును డీప్ కండిషనింగ్ చేయడం వల్ల జుట్టు తేమగా ఉంటుంది. జుట్టు దెబ్బతినే ప్రమాదం కూడా తగ్గుతుంది. స్విమ్మింగ్ తర్వాత మీ జుట్టుకు డీప్ కండిషనింగ్ చేయండి. అయితే దీన్ని కడగడానికి ముందు 5-10 నిమిషాలు అలాగే ఉంచండి.

ఎండ నుంచి రక్షించండి

సూర్యుడు కిరణాలు కూడా జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ముఖ్యంగా క్లోరిన్ లేదా ఉప్పునీటిలో తడిసినప్పుడు. అందుకే టోపీని పెట్టుకోండి. లేదంటే ఎస్పిఎఫ్తో లీవ్-ఇన్ కండీషనర్ ను ఉపయోగించండి. ఇవి సూర్యుడి హానికరమైన కిరణాల నుంచి మీ జుట్టును రక్షించడానికి సహాయపడతాయి.