కొందరు దంపతులకు పెళ్లికి ముందు ఉన్న ఉత్సాహం ఆ తర్వాత ఉండదు. ఏమంటే... శృంగార జీవితాన్ని ఆనందించలేకపోతున్నామనే సమాధానం చెబుతారు. ఎందుకు అనే కారణం తేల్చుకోకుండా దంపతుల మధ్య దూరాన్ని మరింత పెంచేస్తుంటారు. అయితే... శృంగారం విషయంలో ఆనందం ఇద్దరిదీ అన్న విషయం గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు. తమ జీవనవిధానంలో ఈ మార్పులు చేసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు.

ఆందోళన వద్దు: పని ఒత్తిడి, ఇతర ఆందోళనతో ఉండే జంటలు కలయికను సరిగ్గా ఆనందించలేరని చెబుతున్నాయి అధ్యయనాలు. కొన్నిసార్లు దానికి అలసటా కారణమవుతుంది. ఇదే మీ సమస్యా? అయితే... దాన్నుంచి బయటపడే మార్గాలు వెతకండి. ధ్యానం చేయండి. మీకంటూ ఓ అభిరుచి  పెట్టుకోండి. దినచర్యకు ఓ ప్రణాళిక పెట్టుకుని ఒత్తిడి, ఆందోళనను తగ్గించే ప్రయత్నం చేయండి.

అనుబంధం ముఖ్యం: ఏళ్లు గడిచేకొద్దీ భార్యాభర్తల మధ్య అనుబంధం ఉన్నా... ఇద్దరిమధ్యా దూరం పెరుగుతుంది. బాధ్యతలు, పనులు.. కారణాలు ఏవైనా సరే... ఆ దూరాన్ని చెరిపేసుకోవాలి. పెళ్లయిన కొత్తల్లోలా ఇద్దరూ కలిసి ఏకాంతంగా గడిపేలా చూసుకోవాలి. ఒకరికోసం మరొకరు సమయం కేటాయించుకోవాలి. సమస్యల్ని సానుకూల దృక్పథంతో పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి.

నిద్ర అవసరం: దీన్ని నిర్లక్ష్యం చేసినా ఆ ప్రభావం లైంగికజీవితంపై పడుతుంది. నిద్ర సరిగ్గా లేకపోవడానికి జీవనవిధానమే కారణమైతే... అవసరమైన మార్పులు చేసుకోవడం మంచిది. దాంతోపాటు పోషకాహారం తీసుకోవడమూ అవసరమే. ముఖ్యంగా పీచు ఎక్కువగా ఉండే కూరగాయలు, మాంసకృత్తులు, ఇతర పోషకాలు అందేలా చూసుకోవాలి. చక్కెర, నూనె పదార్థాలు తగ్గించాలి.

వ్యాయామం: రోజూ వ్యాయామం చేసేవారిలో లైంగిక వాంఛలు తగ్గవని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనివల్ల బరువూ అదుపులో ఉంటుందనీ... ఆ ఆత్మవిశ్వాసంతో కలయికను ఆనందిస్తారని చెబుతున్నారు నిపుణులు.