భార్యభర్తల బంధం కలకాలం హాయిగా సాగిపోవాలని అందరూ కోరుకుంటారు. ఎవరైనా సరే కలిసి జీవించాలనే వైవాహిక జీవితంలోకి అడుగుపెడతారు. ముందే విడిపోతామని తెలిస్తే.. ఎవరూ ఆ బంధంలోకి  అడుగుపెట్టరు కదా. కానీ.. కొన్ని కారణాల వల్ల నూరేళ్లు సాగాల్సిన బంధం.. మధ్యలోనే ఆగిపోతుంది. అయితే.. దంపతులు విడిపోవడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయంటున్నారు మ్యారేజ్ కౌన్సిలర్స్.
ఈ కారణాల వల్లే దంపతులు విడాలకుల బాట పడుతున్నారు. వీటికి  సంసారంలో తావివ్వకుండా ఉంటే.. మీ బంధం బలంగా ఉన్నట్లేనని  చెబుతన్నారు నిపుణులు.

అందులో మొదటిది ఆధిపత్యం..
దాంపత్యం అనేది.. భార్యభర్తలు ఇద్దరూ కలిసి చేయాల్సింది. అంటే.. ఈ బంధంలో ఇద్దరూ సమానులే. అయితే.. ఒకరిపై మరొకరు చేసే ఆధిపత్యం విడాకులకు మొదటి మెట్టు అవుతోందంటున్నారు నిపుణులు. 

నేను ఎక్కువ, నువ్వు తక్కువ అనే భావన ఇద్దరిలో కలగకుండా చూసుకోవాలి. ఏ కష్టం వచ్చినా నీకు తోడుగా నేను వున్నాననే భావన, ధీమా జీవిత భాగస్వామిలో కలిగించాలి. అలా ఎప్పుడైతే జరగదో అప్పుడే కాపురంలో కలహాలు మొదలవుతాయి. 

ఇక రెండోది నిర్లక్ష్యం..

పెళ్లైన తొలినాళ్లలో ఒకరిపై మరొకరు చాలా కేరింగ్ తీసుకుంటారు. తమ పార్ట్ నర్ ఇష్టాఇష్టాలు తెలుసుకోవాలని భావిస్తుంటారు. వారికి నచ్చేలా ఉండాలని, వారి నుంచి మెచ్చుకోలు అందుకోవాలని ప్రయత్నిస్తుంటారు. సంవత్సరాలు గడుస్తున్న కొద్ది వీటన్నింటినీ పక్కన పెట్టేస్తారు. వారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు.  దీని వల్ల కూడా సమస్యలు మొదలౌతాయి. కాబట్టి మీ జీవిత భాగస్వామిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మూడోది...గౌరవం
దంపతులు ఇద్దరూ ఒకరినొకరు పరస్పరం గౌరవించుకోవాలి. ఒకరి అభిప్రాయాలకి మరొకరు విలువ ఇవ్వాలి. ప్రతీసారి నా అభిప్రాయమే చెల్లాలి అని దంపతులు ఇద్దరిలో ఎవ్వరు అనుకున్నా... అది ఏదో ఓ రోజు కాపురాన్ని కూల్చే పరిస్థితులకి దారితీస్తుండొచ్చు. జీవిత భాగస్వామి నుంచి లభించని గౌరవం, ఆధరణ, పరస్పర సహకారం మరొకరికి తీవ్ర అసంతృప్తిని మిగిల్చే ప్రమాదం వుంది. అదే కానీ జరిగితే ఏదో ఒక రోజు అదే ఆ అసంతృప్తి లావాలా బద్ధలై కాపురాన్ని కూలదోస్తుంది. కాబట్టి ఒకరిని మరొకరు గౌరవించుకోవాలి.

ఈ మూడు సూత్రాలను పాటిస్తే.. జీవితం ఆనందంగా నూరేళ్లపాటు హాయిగా సాగుతుందని నిపుణులు చెబుతున్నారు.