చర్మం పొడిబారడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వీటిలో అతి ముఖ్యమైనది శరీరంలో తగినంత నీరు లేకపోవడమేనంటున్నారు నిపుణులు.  

చర్మం పొడిబారడం, ముడతలు ఎంతో మందిని వేధించే ప్రధాన సమస్య. ఎన్నో కారణాల వల్ల చర్మం పొడిబారుతుంది. వీటిలో ముఖ్యమైనది శరీరానికి తగినంత నీరు లభించకపోవడమేనని నిపుణులు చెబుతున్నారు. నీరు పుష్కలంగా తాగడం వల్ల శరీరానికే కాదు చర్మ ఆరోగ్యానికి కూడా మంచి జరుగుతుంది. డ్రై స్కిన్ ఉన్నవారికి కొన్ని ఆహారాలను ఎంతో మేలు చేస్తాయి. అవేంటంటే.. 

కీరదోసకాయ

కీరదోసకాయల్లో 90 శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. మన శరీరానికి నీరు ఎంత అవసరమో మన చర్మానికి కూడా అంతే అవసరం. కాబట్టి కీరదోసకాయను ఆహారంలో చేర్చుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం బాగుంటుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. డ్రై నెస్ ను పోగొడుతుంది. 

చిలగడదుంప

తీపి బంగాళాదుంపలు కూడా చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. చిలగడదుంపలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చిలగడదుపంల్లో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే డ్రై స్కిన్ సమస్యతో బాధపడేవారు చిలగడదుంపలను రోజూ తినండి. 

బచ్చలికూర

పోషకాలు సమృద్ధిగా ఉండే బచ్చలికూర శరీర ఆరోగ్యానికే కాకుండా చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. బచ్చలికూరలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలేట్, బీటా కెరోటిన్, విటమిన్ కె, జింక్ లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మంపై ముడతలను తొలగించడానికి సహాయపడతాయి. ఇది వృద్ధాప్యానికి సంకేతం. బచ్చలికూర చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి కూడా సహాయపడుతుంది.

అవొకాడో

అవొకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. అవొకాడోలను తినడం వల్ల పొడి చర్మం మటుమాయం అవుతుంది. 

పాలు

పొడి చర్మం ఉన్నవారికి కూడా పాలు ఎంతో మేలు చేస్తాయి. పాలు పొడి చర్మాన్ని దూరం చేస్తాయి. 

గుడ్లు

గుడ్లలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. గుడ్లు చర్మానికి కూడా మంచి మేలు చేస్తాయి. విటమిన్ ఎ, విటమిన్ బి5, విటమిన్ ఇ ఎక్కువగా ఉండే గుడ్లను తీసుకోవడం వల్ల పొడి చర్మం సమస్య పోతుంది. 

గింజలు

పొడి చర్మం ఉన్నవారికి గింజలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో సమృద్ధిగా ఉండే పోషకాలు చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా విటమిన్ బి, విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇతర పోషకాలు ఎక్కువగా ఉండే వాల్ నట్స్ ను తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల చర్మం వృద్ధాప్య లక్షణాలు లేట్ గా వస్తాయి. చర్మం అందంగా మెరిసిపోతుంది.

సోయా

సోయాలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. సోయాబీన్స్ తో తయారు చేసిన అన్ని ఆహారాలలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇవి చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

టమాటాలు

విటమిన్ సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న టమోటాలు చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి సహాయపడతాయి. వృద్ధాప్యంతో వచ్చే చర్మంపై ముడతలు, ఇతర నల్ల మచ్చలను కూడా టమోటాలు తొలగిస్తాయి.

చేపలు

చేపల్లో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చేపలు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలకు గొప్ప మూలం. ఇవి చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి, ప్రకాశవంతమైన చర్మాన్ని కలిగి ఉండటానికి సహాయపడతాయి.