చాలా మంది రాత్రిళ్లు ఎంత ప్రయత్నించినా నిద్రపట్టడం లేదు అని చెబుతూ ఉంటారు. పని ఒత్తిడి, ఎక్కవ సేపు కంప్యూటర్లు, ఫోన్లు వంటి వాటిని చూడటం ఇలా కారణం ఏదైనా.. నిద్రలేమి సమస్యతో బాధపడేవారి  సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే.. రాత్రి నిద్రపోకపోతే.. ఆ ఎఫెక్ట్.. తర్వాతి రోజుపై పడుతుంది. రోజంతా నీరసంగా.. మెదడు పనిచేయనట్టుగా, ఉత్సాహంగా లేకుండా ఉండటం లాంటివి జరుగుతాయి. మరి దీనికి పరిష్కారమే లేదా అంటే.. ఉంది ఈ కింది స్టెప్స్ ఫాలో అయితే చాలు అంటున్నారు నిపుణులు.

ప్రతిరోజూ ఒకే సమయంలో నిద్రపోవడానికి ప్రయత్నించాలి. ఇలా కొద్దిరోజులు ప్రయత్నిస్తే.. రోజూ అదే సమయానికి వద్దు అన్నా కూడా నిద్ర ముంచుకు వస్తుంది. అంతేకాదు.. పడుకునే ముందు కెఫీన్ పదార్థాలు అస్సలు తీసుకోకూడదు. సాయంత్రం ఐదు తర్వాత వీటిని మానేయడం చాలా మంచిది. కెఫీన్ నిద్రపట్టకుండా చేస్తుంది.

నిద్రపోవడానికి రెండు గంటల ముందు నుంచే టీవీ చూడటం, లాప్ టాప్, సెల్ ఫోన్ లకు దూరంగా ఉండాలి. వీటి నుంచి వచ్చే బ్లూ కలర్ స్క్రీన్ నిద్రకు ఆటంకంగా మారుతుంది.

పగటిపూట నిద్రపోయే అలవాటు ఉంటే.. దానిని కాస్త నియంత్రించుకోవాలి. అలా చేస్తే.. రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపడుతుంది. అంతేకాకుండా పడుకునే ముందు గోరువెచ్చని పాలు లేదా పెరుగు వంటి ఆహారం తీసుకోవాలి. వీటిల్లో మెలటోనిన్ ఎక్కువగా ఉంటుంది. అవి నిద్రపట్టడానికి ఉపయోగపడతాయి.