అందాల పోలీసు... మిసెస్ ఇండియా కిరీటం గెలుచుకుంది..!
నిత్యం దొంగతనాలు,దోపిడీలు వంటి కేసులతో సతమతమయ్యే ప్రేమను భర్త.. అందాల పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించారు. అతని ప్రోత్సాహంతోనే ఆమె మిసెస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఇప్పుడు విజయం సాధించారు.
పోలీసు ఉద్యోగం అనగానే వాళ్లు చాలా సీరియస్ గా, టఫ్ గా ఉంటారని మన అందరిలో ఒక ఫీలింగ్ ఉంటుంది. అది స్త్రీలైనా, పురుషులైనా... పోలీసుల పేరు వింటేనే చాలా మంది భయపడతారు. ఈ డిపార్ట్ మెంట్ కీ... అందాల పోటీలు పూర్తి విభిన్నం. అందాలపోటీలు అనేవి ఓ గ్లామర్ ప్రపంచం. ఈ రెండింటినీ ఓ మహిళ ముడివేసింది.
ఒకవైపు పోలీసు అధికారిణిగా బాధ్యతలు చేపడుతూనే...మరోవైపు మిసెస్ ఇండియా పోటీల్లో పాల్గొని కిరీటం గెలుచుకుంది. ఆమె పూణేలోని కరాడ్ ప్రాంతానికి చెందిన 29ఏళ్ల ప్రేమ పాటిల్. ప్రేమ కామర్స్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఆమె 2010లో పోలీస్ డిపార్ట్ మెంట్ లో సబ్ ఇన్ స్పెక్టర్ గా చేశారు. ముంబయిలోని థానే పోలీస్ స్టేషన్ లో ఎన్నో దొంగతనం కేసులను చాకచక్యంగా చేధించారు. మహిళా నేరస్తులను సున్నితంగా డీల్ చేయడంలో ఆమెకు మంచి పేరుంది. ఆమె ప్రతిభకు మెచ్చి పూణేలోని స్పెషల్ బ్రాంచ్ లో అసిస్టెంట్ పోలీస్ ఇన్ స్పెక్టర్ గా పదోన్నతిని కూడా పొందారు. 2014లో విఘ్నేష్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు.
నిత్యం దొంగతనాలు,దోపిడీలు వంటి కేసులతో సతమతమయ్యే ప్రేమను భర్త.. అందాల పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించారు. అతని ప్రోత్సాహంతోనే ఆమె మిసెస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఇప్పుడు విజయం సాధించారు. తాను అందాల పోటీల్లో పాల్గొనాలనేది తన భర్త కోరికని.. ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతోనే తాను ఈ విజయం సాధించగలిగానని ఆమె కిరీటం అందుకున్న తర్వాత చెప్పారు.
రోజూ స్టేషన్ కి డ్యూటీ కోసం వెళ్లేదానినని... ఆ తర్వాత ఇంటికి వచ్చి ర్యాంప్ వాక్ ప్రాక్టీస్ చేసేదానినని ఆమె తన విజయం తాలూకు శ్రమను వివరించారు. ఈ విజయంతో తాను తానొక సెలబ్రెటీగా మారానని.. అందరూ ఫోన్లు చేసి అభినందనలు తెలుపుతుంటే చాలా సంతోషంగా ఉందని ఆమె ఈ సందర్బంగా తెలిపారు.