మనుషులకంటే తెలివైన 10 జంతువుల గురించి తెలుసా
ఈ ప్రపంచంలో మనుషులే బాగా తెలివైన వారు అనుకుంటారు. అయితే కొన్ని విషయాల్లో మనుషుల కంటే తెలివైన జంతువులు ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ పూర్తి వివరాలు ఉన్నాయి.
కొన్ని జంతువులను చూసినా, అవి చేసే పనులు తెలిసినా వెంటనే వాటిని తెగ పొగిడేస్తుంటాం కదా. నిజానికి కొన్ని జంతువులు మనం ఊహించిన దానికంటే చాలా తెలివితేటలు కలిగి ఉంటాయి. సమస్యలు పరిష్కరించుకుంటాయి. కమ్యూనికేషన్ పెంచుకుంటాయి. ప్రమాదాలను ముందుగానే గుర్తిస్తాయి. ఇలాంటి చాలా గ్రేట్ క్వాలిటీస్ వాటికి ఉంటాయి. అలాంటి అరుదైన 10 జంతువుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
తెలివైన జంతువుల్లో చింపాంజీలు గ్రేట్
మనుషుల్లాగే రెండు చేతులు, రెండు కాళ్లతో ఉండే ముఖ్యమైన జంతువులు చింపాంజీలు. వాటి తెలివి తేటలు అద్భుతంగా ఉంటాయి. చింపాంజీలు వాటి ఫుడ్ సంపాదించేందుకు ప్రత్యేక సాధనాలు వాడతాయి. ముఖ్యంగా ఏవైనా గింజలు, కాయలు పగలగొట్టడానికి చాకులు, సుత్తి లాంటి పరికరాలను ఉపయోగిస్తాయి. అంతేకాకుండా అవి నేర్చుకున్న విషయాలను వాటి వారసులకు నేర్పిస్తాయి. చింపాంజీలు వాటి టాలెంట్, శక్తి సామర్థ్యాలను హైలైట్ చేస్తూ తోటి వాటికి చూపిస్తాయి. సమస్యలు పరిష్కరించుకొనే తెలివితేటలు కూడా వాటికి ఉంటాయి.
కాకుల తెలివి అద్భుతం
పక్షులన్నింటిలో తెలివైనవి కాకులు. అవి మనుషుల మొహాలను గుర్తుపెట్టుకుంటాయి. గ్రూపులుగా బతుకుతాయి. ఏదైనా సమస్య వస్తే వాటిని ఎలా పరిష్కరించుకోవాలో వాటికి బాగా తెలుసు. అవి సొంతంగానే కాకుండా గ్రూపులుగా చర్చించుకొని సమస్యలు పరిష్కరించుకుంటాయి. వాటికి ప్రేమాభిమానాలు కూడా ఎక్కువగా ఉంటాయి. రోజూ అవి టైం ప్రకారం ఆహారం దొరికే చోటకు వెళతాయి. ఫుడ్ కావాలని వాటి అరుపుల ద్వారా చెప్పడానికి ప్రయత్నిస్తాయి.
విశ్వాసానికి నిదర్శనం కుక్కలు
విశ్వాసానికి రియల్ ఎగ్జాంపుల్ కుక్కలు. మనుషులకు అవి మంచి స్నేహితులు కూడా. ఇవి చాలా తెలివైన జంతువులు. వాటికి కావాల్సినవి ఎలా సంపాదించుకోవాలో వాటికి బాగా తెలుసు. యజమానులను ఏ విషయంలో రిక్వెస్ట్ చేయాలి? ఎక్కడ ఫైట్ చేసి సంపాదించుకోవాలన్న విషయంపై చాలా క్లారిటీగా ఉంటాయి. భావోద్వేగాలను వ్యక్త పరచడంలో వాటికి సాటి వేరే జంతువులు ఉండవు. అంతేకాకుండా మనుషుల ఫీలింగ్స్ ను కూడా కుక్కలు బాగా అర్థం చేసుకుంటాయి. ఏదైనా కనిపెట్టడంలో వాటి తెలివి అమోఘం. అందుకే వాటిని పోలీస్, మిలటరీ, స్క్వాడ్ డిపార్ట్ మెంట్లలో ఉపయోగిస్తారు.
డాల్ఫిన్లు అత్యంత తెలివైనవి
సముద్రంలో ఉన్న జీవుల్లో డాల్ఫిన్లు అత్యంత తెలివైనవి. మనం ఫోన్లు, ఇంటర్నెట్ ఉపయోగించి కమ్యూనికేట్ అవుతుంటాం. మరి డాల్ఫిన్లు విజిల్స్ ద్వారా సమాచారాన్ని షేర్ చేసుకుంటాయి. ఇవి కూడా ఫీలింగ్స్ ను వ్యక్త పరుస్తాయి. లవ్, ఎఫెక్షన్, కోపం లాంటి వాటిని చేతల్లో చూపిస్తాయి. సాధారణంగా ఇవి చాలా ప్రేమగా ఉంటాయి. కొన్ని దేశాల్లో డాల్ఫిన్లకు ట్రైనింగ్ ఇచ్చి సముద్రంలో అంతుచిక్కని విషయాల గురించి పరిశోధనలు చేస్తుంటారు.
ఏనుగుల మెమొరీ సాటి లేనిది
ఎలిఫెంట్స్ కి మెమొరీ పవర్ చాలా ఎక్కువ. వీటికి మనుషుల్లాగా ప్రేమ, ఆప్యాయతలు కూడా ఉంటాయి. కుటుంబ బాధ్యతలు, పిల్లల పెంపకం, వాటికి జీవించే విధానాలు నేర్పడం లాంటివి చేస్తుంటాయి. ఇవి ఎక్కువగా గ్రూపులుగా జీవిస్తాయి. వాటిలో ఏ ఒక్కదానికైనా ఏదైనా జరిగితే చాలా బాధపడతాయి. ఆ గుంపులో ఎవరైనా చనిపోతే సంతాపం ప్రకటిస్తాయి. కొన్ని కి.మీ. దూరంలో ఉన్న వాటి తోటి ఏనుగులకు అవి ఉన్న ప్రదేశం నుంచి సంకేతాలు పంపుతాయి. వాతావరణ పరిస్థితులను అంచనా వేస్తాయి. రాబోయే విపత్తులను ముందుగానే గుర్తిస్తాయి.
వేటాడటంలో ఆక్టోపస్ ఫస్ట్
శత్రువుకు దొరక్కుండా తప్పించుకోవడంలో ఆక్టోపస్ తెలివితేటలు అమోఘం. వేటాడటంలో చాలా నైపుణ్యాన్ని ప్రదర్శించి ఆహారాన్ని సంపాదిస్తాయి. వాటి శత్రువులకు దొరక్కుండా తిరగడంలోనూ, ఇవి వేటాడే సమయంలోనూ ఎదుటి వాటిని ఈజీగా మానిప్యులేట్ చేసేస్తాయి. అవి నివసించే పరిస్థితులను బట్టి నేవిగేట్ చేసుకుంటూ తిరుగుతాయి.
ఓరంగుటాన్ లు వస్తువులను కూడా ఉపయోగిస్తాయి
కోతి జాతికి చెందిన ఈ జీవులు వాటి వేట సమయంలో చాకచక్యంగా వ్యవహరిస్తాయి. ఇవి ఎక్కువగా కీటకాలు, పండ్లను తింటాయి. వాటి కోసం అవి కర్రలను ఉపయోగించి వేటాడతాయి. అంతేకాకుండా తోటి జంతువుల నుంచి విషయాలు నేర్చుకుంటాయి. వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా వాటి జీవన శైలిని కూడా అవి మార్చుకోగలవు.
మాటలు నేర్చిన చిలుకలు
చిలుకలు ఎప్పుడూ మాటలు నేర్చుకోవడానికి ఉత్సాహం చూపుతాయి. అరుపుల ద్వారా వాటి భావాలు వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తుంటాయి. ఇవి ప్రేమ, ఆప్యాయతలను కూడా చూపిస్తాయి. కోపం, అలక, చిలిపితనం ఇలా అనేక భావోద్వేగాలను కలిగి ఉంటాయి. ఇవి భాషలు కూడా ఈజీగా నేర్చుకోగలవు. మనుషులు చెప్పే విషయాలను అర్థం చేసుకోగలవు. నేర్చకున్న పదాలను ఉపయోగించి వాటికి కావాల్సిన పనులు చేయించుకుంటాయి.
పందులు కూడా తెలివైనవే
సాధారణంగా పందులను ఎవరూ ఇష్టపడరు. డర్టీగా ఉంటాయని వాటి దగ్గరకు కూడా వెళ్లేందుకు సాహసించరు. అయితే పందులకు అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి. సమస్య వచ్చినప్పుడు తెలివితేటలుగా ఆలోచించి పరష్కరించుకోగలవు. ఇవి సంచార జీవులు. ఎప్పుడూ ఫుడ్ కోసం తిరుగుతూ ఉంటాయి. అందువల్ల అవి తిరిగిన ప్రదేశాలను గుర్తుపెట్టుకుని తిరుగుతుంటాయి. ఇవి మనుషులను కూడా గుర్తించగలవని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
తెలివి తేటలతో ఎక్కువ కాలం జీవించే రావెన్
కాకిని పోలి ఉండే పక్షి ఇది. కాని పరిమాణంలో వాటి కంటే పెద్దగా ఉంటాయి. ఇవి వాటి తెలివి తేటల వల్ల ఈ భూమి మీద 23 సంవత్సరాల వరకు జీవించగలవు. మనుషుల్లాగే భవిష్యత్తు ప్లాన్ లు వేస్తాయి. కొన్ని వస్తువులను వాటి అవసరాల కోసం ఉపయోగిస్తాయి. వాటి ఫుడ్ సంపాదించడంలో అద్భుతమైన తెలివిని ప్రదర్శిస్తాయి.