Kho Kho World Cup 2025: భారత మహిళా టీం దూకుడు... క్వార్టర్ ఫైనల్‌కు ఎంట్రీ
భారత మహిళల జట్టు ఖో ఖో ప్రపంచ కప్ 2025లో గ్రూప్ దశలో వరుసగా మూడు విజయాలు సాధించి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది.
Kho Kho World Cup 2025 : ఖో ఖో ప్రపంచ కప్ 2025లో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. గురువారం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో మరోసారి భారత జట్టు అదరగొట్టింది. ఈ మెగా టోర్నీలో మలేషియాను ఓడింది వరుసగా మూడో విజయం సాధించింది. ఇలా ప్రియాంక ఇంగల్ నేతృత్వంలోని జట్టు మరోసారి సత్తా చాటి క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్లింది.
టాస్ గెలిచిన భారత మహిళల జట్టు మొదట ఎదురుదాడికి బదులుగా రక్షణను ఎంచుకుంది. ఇలా తెలివిగా ఆడుతూ ప్రత్యర్థి మలేషియా టీంను బోల్తా కొట్టించారు. మొదటి టర్న్ ముగిసే సమయానికి స్కోరు 6-6తో సమంగా ఉంది. ఇక రెండవ టర్న్‌లో ప్రియాంక ఇంగల్ నేతృత్వంలోని భారత జట్టు మలేషియా ఆటగాళ్లపై అటాకింగ్ కు దిగింది. దీంతో భారత్ అద్భుత ఫలితాన్ని రాబట్టింది. ఈ టర్న్ ముగిసే సమయానికి భారత్ మలేషియాపై 40-6తో ఆధిక్యంలో ఉంది.
ఇక మూడవ టర్న్‌లో భారత్ తిరిగి రక్షణకు దిగింది. మలేషియా జట్టు అటాకింగ్ గా ఆడినా భారత్ కీలకమైన పాయింట్లను సాధించగలిగింది. మూడవ టర్న్ ముగిసే సమయానికి భారత్ ఆధిక్యం 34 పాయింట్ల నుండి 28 పాయింట్లకు తగ్గింది. నాల్గవ టర్న్‌లో భారత ప్లేయర్లు మలేషియా డిఫెండర్లపై ఒత్తిడి తెచ్చి మరో 60 పాయింట్లు సాధించారు. ఇలా మ్యాచ్ ముగిసే సమయానికి భారత్ మలేషియాపై 100-20తో విజయం సాధించింది.
ఇలా టర్న్ టర్న్ కు స్ట్రాటజీ మారుస్తూ ఆడి అద్భుత విజయం సాధించింది భారత మహిళా టీం. వరుసగా మూడు విజయాలతో, భారత్ గ్రూప్ Aలో అగ్రస్థానంలో నిలిచి క్వార్టర్ ఫైనల్ కు చేరింది.
భారత మహిళల జట్టు ఇప్పటికే దక్షిణ కొరియా, ఇరాన్‌పై విజయం సాధించింది. ఇప్పుడు మలేషియాపై మరో విజయం. ఇలా వరుస విజయాలతో క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. భారత్‌తో పాటు, ఇంగ్లాండ్, కెన్యా, నేపాల్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ కూడా నాకౌట్ దశకు చేరుకున్నాయి. జనవరి 17న జరిగే క్వార్టర్ ఫైనల్లో భారత్ బంగ్లాదేశ్‌తో తలపడనుంది.