Kho Kho World Cup 2025 : భూటాన్ పై అద్భుత విజయం... క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్లిన ఇండియన్ మెన్స్ టీం

భారత పురుషుల ఖో ఖో జట్టు వరుసగా నాలుగు విజయాలతో వరల్డ్ కప్ 2025 క్వార్టర్ ఫైనల్ కు చేరుకుంది.  రేపు (శుక్రవారం, జనవరి 17న) జరిగే క్వార్టర్ ఫైనల్లో భారత్ శ్రీలంకతో తలపడనుంది.  

Kho Kho World Cup 2025 India Enters Quarterfinals After Defeating Bhutan AKP

Kho Kho World Cup 2025 : ప్రపంచ దేశాల మధ్య సాగుతున్న ఖో ఖో సమరంలో భారత్ దూకుడు ప్రదర్శిస్తోంది. ఓవైపు పురుషులు, మరోవైపు మహిళలు అద్భుతంగా ఆడుతూ టైటిల్ దిశగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఈ ఖో ఖో ప్రపంచ కప్ 2025 లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టు మరో విక్టరీ సాధించింది. ఇవాళ గురువారం (జనవరి 16న) న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో భూటాన్‌ ను మట్టికరిపించి వరుసగా నాల్గవ విజయాన్ని అందుకుంది. ఇలా గ్రూప్ దశలో విజయపరంపర కొనసాగిస్తూ క్వార్టర్ ఫైనల్ కు చేరింది భారత పురుషుల జట్టు. 

టాస్ గెలిచిన భారత పురుషుల జట్టు మ్యాచ్ ప్రారంభంలోనే ఎదురుదాడి ప్రారంభించింది. ప్రత్యర్థి జట్టు డిఫెండర్లను పట్టుకోవడంతో ఆతిథ్య జట్టు అద్భుతాలు చేసింది. దీంతో భూటాన్ ఓటమి దిశగా ప్రయాణించింది. టర్న్ 1 చివరిలో భారత్ 32 పాయింట్లు సాధించింది. టర్న్ 2లో భూటాన్ ప్లేయర్ పోరాటం చేసారు... భారత్‌కు గట్టి పోటీనిచ్చారు. అయితే భారత డిఫెండర్లు దృఢంగా నిలిచి భూటాన్ ఆధిక్యంలోకి రాకుండా అడ్డుకున్నారు. 

టర్న్ 2 చివరిలో భూటాన్ పై భారత్ 32-18తో ముందంజలో ఉంది. మొదటి అర్ధభాగం ముగిసే సమయానికి భారత్ 14 పాయింట్ల ఆధిక్యంలో ఉంది. రెండో అర్ధభాగం ప్రారంభంలో అంటే టర్న్ 3లో భారత్ తమ దాడిని పునఃప్రారంభించింది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే కొంచెం మెరుగ్గా రాణించింది. టర్న్ 3 చివరిలో భారత్ అదనంగా 36 పాయింట్లు సాధించి తమ ఆధిక్యాన్ని 52 పాయింట్లకు పెంచుకుంది. ఇలా స్కోరు 70-18కు చేరింది.

టర్న్ 4లో భూటాన్ ఎదురుదాడికి ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది...  రెండో అర్ధభాగం కూడా పూర్తయ్యే సమయానికి భారత్ తన ఆధిక్యాన్ని 39 పాయింట్లకు పెంచుకుంది. ఇలా తుది స్కోరు 71-34గా వుంది. భూటాన్‌పై విజయంతో ఆతిథ్య భారత్ గ్రూప్‌ దశలో వరుసగా నాలుగు మ్యాచ్‌లను గెలిచి అజేయంగా నిలిచింది. 

ప్రతీక్ వైకర్ నాయకత్వంలోని భారత ఖో ఖో టీం నేపాల్, బ్రెజిల్, పెరూలపై వరుసగా మూడు విజయాలు సాధించింది... ఇప్పుడు భూటాన్ తో నాలుగో విజయం సాధించి ఖో ఖో ప్రపంచ కప్ 2025 క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇక భారత మహిళల జట్టు కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. పురుషుల విభాగంలో భారత్‌తో పాటు, నేపాల్, ఇరాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇంగ్లాండ్, కెన్యా కూడా ప్రతిష్టాత్మక వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాయి. 

నాకౌట్ దశకు చేరుకునే ముందు గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన జట్లు భారత్, ఇరాన్, బంగ్లాదేశ్, కెన్యా, ఇంగ్లాండ్ మాత్రమే. భారత పురుషుల జట్టు శుక్రవారం జనవరి 17న జరిగే క్వార్టర్ ఫైనల్లో శ్రీలంకతో తలపడనుంది. ఖో ఖో ప్రపంచ కప్ టైటిల్ కోసం భారత పురుషులు, మహిళల టీంల ప్రయాణం కొనసాగుతోంది. 

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios