ప్రతి విద్యార్థి దశలో పదవ తరగతి అనేది కీలకమైన మలుపు. ఇప్పటి వరకు పాఠశాల చదువును విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు ఆ తర్వాత ఏం చేయాలనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. అయితే, ఇప్పుడు తీసుకునే నిర్ణయమే విద్యార్థుల భవిష్యత్‌ను నిర్ణయిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. అందుకే పదో తరగతి తర్వాత ఏం చేయాలనేదానిపై  తీసుకునే నిర్ణయం అన్ని విధాలుగా ఆలోచించి తీసుకోవాలి. 

పదవ తరగతి తర్వాత విద్యార్థులు తీసుకునే ఏ కోర్సు అయినా వారి కెరీర్‌ను నిర్ణయించేవిగా ఉంటాయి. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత విద్యార్థులు తమకున్న అవకాశాలు, అభిరుచుల మేరకు ఆ తర్వాత కోర్సులను ఎంచుకుంటే మంచిది. లేదంటే ఆ తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

సైన్స్ సబ్జెక్టుపై ఇష్టముంటే...
పదో తరగతి తర్వాత సైన్స్ కోర్సుల్ని ఎంచుకోవచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, గణితం సబ్జెక్టుతో కోర్సులు చేయొచ్చు. ఇంటర్‌లో వీటితో ఎంపీసీ, ఎంఈసీ, బైపీసీ లాంటి కోర్సులు ఉంటాయి. 

ఇక ఇంజినీరింగ్, వైద్య రంగం వైపు వెళ్లాలనుకునేవారు సైన్స్ కోర్సుల తర్వాత ఎంసెట్, జేఈఈ, బిట్ శాట్, నీట్ పరీక్షల ద్వారా ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందవచ్చు. ఎంపీసీ, ఎంఈసీ, ఎంబీపీసీ, బైపీసీ, లాంటి కోర్సులను ఎంచుకోవచ్చు. 

బ్యాంకింగ్, బిజినెస్ సబ్జెక్టు ఇష్టమైతే.. కామర్స్ కోర్సుల్ని ఎంచుకోవచ్చు.
ఇంటర్మీడియట్‌లో సీఈసీ తీసుకోవచ్చు. ఆ తర్వాత చార్డెర్డ్ అకౌంటెంట్స్(సీఏ), కంపెనీ సెక్రటరీ(సీఎస్), అకౌంటెంట్స్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ లాంటి కెరీర్ కోసం కామర్స్ కోర్సుల్ని ఎంచుకోవచ్చు. 

అంతేగాక, కామర్స్‌లో బిజినెస్ ఎకనామిక్స్, అకౌంటెన్సీ, బిజినెస్ట్ స్టడీ, బిజినెస్ లా లాంటి సబ్జెక్టుల కోర్సులు కూడా ఉంటాయి. కామర్స్ ఇష్టమైతే సీఈసీ ఎంచుకోవాలి. 

ఆర్ట్స్ వైపు వెళ్లాలనుకుంటే..
సైకాలజీ, పొలిటికల్ సైన్స్, ఫిలాసఫీ, హిస్టరీ, లిటరేచర్, సోషయాలజీ లాంటి సబ్జెక్ట్స్ ఇష్టమైతే ఆర్ట్స్ కోర్సులు ఎంచుకోవచ్చు. జర్నలిజమ్, లిటరేచర్, సోషల్ వర్క్స్, టీచింగ్ ఫీల్డ్స్‌లో కెరీర్ తీర్చిదిద్దుకోవచ్చు. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, సంస్కృతం, ఫ్రెంచ్, అరబిక్ లాంటి లాంగ్వేజ్ కోర్సులు కూడా చేయవచ్చు. 

టెక్నికల్ విభాగంలో అయితే.. 
ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ ఇంజినీరింగ్, గార్మెంట్ టెక్నాలజీ, హోంసైన్స్, అగ్రికల్చర్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఇన్స్యూరెన్స్ అండ్ మార్కెటింగ్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ విభాగాల్లో డిప్లొమా కోర్సులు ఉంటాయి. 

ప్రొఫెషనల్ కోర్సులు: 
పదో తరగతి తర్వాత కూడా ప్రొఫెషనల్ కోర్సులు ఎంచుకోవచ్చు. డిప్లొమా, వొకేషనల్, సర్టిఫికేట్ కోర్సులున్నాయి. మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో డిప్లొమా, అర్కిటెక్చర్, ఫ్యాషన్ డిజైనింగ్, బిజినెస్‌లో డిప్లొమా చేయవచ్చు. ఐటీఐలో ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, ప్లంబర్, ఫిట్టర్, మెకానిక్, టెక్నీషియన్ కోర్సులు ఎంచుకోవచ్చు. పాలిటెక్నిక్ ద్వారా టెక్నికల్ కోర్సులు చేయవచ్చు.

పదో తరగతి తర్వాత తీసుకునే నిర్ణయం భవిష్యత్‌ను నిర్ణయించేదిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. విద్యార్థులు తమ అభిరుచులు, అవకాశాలను బట్టి కోర్సులను ఎంపిక చేసుకోవాలి. అవసరమైతే ఉపాధ్యాయుల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలి. ఏ కోర్సు చేస్తే ఎలా ఉంటుంది? అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుని విద్యార్థులు తమకు తగిన కోర్సును ఎంపిక చేసుకుంటే ఉన్నత చదువులు కూడా కూడా సాఫీగా సాగిపోతాయి. జీవితంలో నిలదొక్కుకునే అవకాశం ఏర్పడుతుంది.