ISL 2021-22 : పాయింట్ల పట్టికలో తొలిసారి అగ్రస్థానంలోకి హెచ్‌ఎఫ్‌సీ

బుధవారం హెచ్‌ఎఫ్‌సీ, ఏటీకే మోహన్‌బగాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ 2-2 తో డ్రాగా ముగిసింది. దీంతో ప్రస్తుతం తొమ్మిది మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, నాలుగు డ్రాలు, ఒక ఓటమితో 16 పాయింట్లు ఖాతాలో వేసుకున్న హైదరాబాద్‌ లీగలో తొలిసారి అగ్రస్థానం దక్కించుకుంది. 

ISL 2021-22 , Hyderabad FC tops Points table after match with ATK Mohun Bagan

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌(ఐఎస్‌ఎల్‌)లో హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌(హెచ్‌ఎఫ్‌సీ) మరో అద్భుత ప్రదర్శన. గతానికి భిన్నంగామ్యాచ్‌ మ్యాచ్‌కు అదరగొడుతున్న హెచ్‌ఎఫ్‌సీ లీగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లింది. బుధవారం హెచ్‌ఎఫ్‌సీ, ఏటీకే మోహన్‌బగాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ 2-2 తో డ్రాగా ముగిసింది. దీంతో ప్రస్తుతం తొమ్మిది మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, నాలుగు డ్రాలు, ఒక ఓటమితో 16 పాయింట్లు ఖాతాలో వేసుకున్న హైదరాబాద్‌ లీగలో తొలిసారి అగ్రస్థానం దక్కించుకుంది.

హెచ్‌ఎఫ్‌సీ తరఫున స్టార్‌ ౖస్ట్రెకర్‌ ఓగ్బాచె(18ని), సివేరియో(90ని) గోల్స్‌ చేశారు. ఏటీకే జట్టులో విలియమ్స్‌(1ని), అశిష్‌ రాయ్‌(64ని ఓన్‌గోల్‌ హెచ్‌ఎఫ్‌సీ) నమోదయ్యాయి. 15 పాయింట్లతో ఏటీకే ప్రస్తుతం మూడోస్థానంలో ఉంది. హెచ్‌ఎఫ్‌సీ తమ తదుపరి మ్యాచ్‌లో ఈనెల 9న కేరళ బ్లాస్టర్స్‌తో తలపడుతుంది.  

హోరాహోరీగా...

ఐఎస్‌ఎల్‌లో రెండు అత్యుత్తమ జట్లు అనదగ్గ హెచ్‌ఎఫ్‌సీ, ఏటీకే మోహన్‌బగాన్‌ జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. మ్యాచ్‌ మొదలైన మొదటి నిమిషంలోనే మోహన్‌బగాన్‌ ఖాతా తెరిచింది. హ్యూగో బౌమాస్‌ నుంచి పాస్‌ అందుకున్న డేవిడ్‌ విలియమ్స్‌ గోల్‌ కొట్టడంతో ఏటీకే 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మ్యాచ్‌ ప్రారంభమైన 12 సెకన్ల వ్యవధిలోనే గోల్‌ కావడం ఐఎస్‌ఎల్‌ చరిత్రలో ఇది తొలిసారి కావడం విశేషం.

Also Read : రా.. నువ్వో నేనో తేల్చుకుందాం...! గ్రౌండ్ లో బాహాబాహీకి దిగిన బుమ్రా, జాన్సేన్

ఆదిలోనే ప్రత్యర్థి గోల్‌కొట్టడంతో ఒకింత ఒత్తిడిలోకి వెళ్లిన హెచ్‌ఎఫ్‌సీ తమ డిఫెన్స్‌ను అలర్ట్‌ చేసింది. దీనికి తోడు బంతిని ఎక్కువ శాతం తమ ఆధీనంలో ఉంచుకునేందుకు ప్రయత్నించింది. మ్యాచ్‌ 18వ నిమిషంలో స్టార్‌ ౖస్ట్రెకర్‌ ఓగ్బాచె అదిరిపోయే గోల్‌ కొట్టడంతో స్కోరు 1-1తో సమమైంది.

ఏటీకే గోల్‌కీపర్‌ అమరీందర్‌సింగ్‌ వైఫల్యాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్న హెచ్‌ఎఫ్‌సీ చాకచక్యంగా గోల్‌ చేసింది. డీ బాక్స్‌లో అనికేత్‌ జాదవ్‌ కొట్టిన బంతిని అమరీందర్‌ సరిగ్గా అందుకోకపోవడం అదే సమయంలో అక్కడే కాచుకు కూర్చున్న ఓగ్బాచె నేర్పుగా గోల్‌ చేయడం క్షణాల్లో జరిగిపోయింది. దీంతో ఇప్పటి వరకు లీగ్‌లో ఓగ్బాచె గోల్స్‌ సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. మొత్తంగా గోల్డెన్‌ బూట్‌ రేసులో ఓగ్బాచె రాకెట్‌లా దూసుకెళుతున్నాడు.

19వ నిమిషంలో అనికేత్‌ జాదవ్‌ గోల్‌ కోసం ప్రయత్నించినా..తృటిలో చేజారింది. అయితే గోల్స్‌ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఇరు జట్లకు చెందిన ప్లేయర్లు గాయాల పాలయ్యారు. ఓగ్బాచె తిరిగి మైదానంలోకి వచ్చినా..ఏటీకే మిడ్‌ఫీల్డర్‌ కార్ల్‌ మెక్‌హును అంబులెన్స్‌లో తరలించారు. కార్ల్‌ స్థానంలో జానీ కౌకోను ఏటీకే బరిలోకి దింపింది. మ్యాచ్‌ 45వ నిమిషంలో ఏటీకే ప్లేయర్‌ హుగో బౌమస్‌ యెల్లో కార్డ్‌కు గురయ్యాడు. లీగ్‌లో ఇప్పటి వరకు నాలుగు సార్లు యెల్లో కార్డ్‌ ఎదుర్కొన్న హుగో..తదుపరి మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇలా తొలి అర్ధభాగం ముగిసే సరికి ఇరు జట్ల స్కోరు 1-1తో సమమైంది.

కీలకమైన ద్వితీయార్ధంలో హెచ్‌ఎఫ్‌సీ, ఏటీకే మరింత జోరు పెంచాయి. ఒకరి గోల్‌ పోస్ట్‌ లక్ష్యంగా ఒకరు మెరుపు దాడులకు పూనుకున్నారు. 59వ నిమిషంలో ఎడు గార్సియా చేసిన ప్రయత్నాన్ని ఏటీకే గోల్‌కీపర్‌ సమర్థంగా అడ్డుకున్నాడు. అయితే మ్యాచ్‌ 64వ నిమిషంలో ప్రత్యర్థి గోల్‌ను అడ్డుకునే ప్రయత్నంలో  అశిష్‌ రాయ్‌ ఓన్‌ గోల్‌ చేయడంతో ఏటీకే 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక్కణ్నుంచి మరింత జోరు పెంచిన హెచ్‌ఎఫ్‌సీ  దూకుడైన ఆటతీరు కనబరిచింది.

అప్పటి వరకు పలు ప్రయత్నాలు చేసిన విఫలమైన హెచ్‌ఎఫ్‌సీ ఈసారి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. మ్యాచ్‌ ఇక ముగుస్తుందనగా 90వ నిమిషంలో సహచర ప్లేయర్‌ కొట్టిన వ్యాలీని జేవియర్‌ సివేరియో అద్భుత హెడర్‌తో కండ్లు చెదిరే రీతిలో గోల్‌ కొట్టడంతో హెచ్‌ఎఫ్‌సీ గెలుపు సంబురాల్లో మునిగిపోయింది. ఎక్స్‌ట్రా టైమ్‌లో ఏటీకే ఫ్రికిక్‌ అవకాశం వచ్చినా..దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయింది. మొత్తంగా సమవుజ్జీలు అన్నదగ్గ జట్ల మధ్య పోరు సమమైంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios