ISL 2022 ఛాంపియన్‌గా నిలిచిన హైదరాబాద్ ఎఫ్‌సీ... ఫైనల్‌లో కేరళ బ్లాస్టర్స్‌కి నిరాశ...
హోరాహోరీగా ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్... స్కోర్లు సమం కావడంతో ఐఎస్‌ఎల్ ఫైనల్‌లో తొలిసారి పెనాల్టీ షూటౌట్... 3-1 తేడాతో కేరళ బ్లాస్టర్స్‌ను ఓడించిన హైదరాబాద్ ఎఫ్‌సీ...
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) 2022 సీజన్ ఛాంపియన్‌గా హైదరాబాద్ ఎఫ్‌సీ అవతరించింది. మొట్టమొదటిసారి ఫైనల్ చేరిన హైదరాబాద్ ఎఫ్‌సీ, పెనాల్టీ షూటౌట్‌లో 3-1 తేడాతో కేరళ బ్లాస్టర్స్‌ని ఓడించి విజేతగా నిలిచింది. మూడో సారి ఫైనల్ చేరిన కేరళ బ్లాస్టర్స్‌కి మరోసారి నిరాశే ఎదురైంది...
పూర్తి సమయం ముగిసే సమయానికి ఇరు జట్లు చెరో గోల్‌తో 1-1 సమంగా నిలవడంతో ఎక్స్‌ట్రా ఇచ్చారు రిఫరీ. అయితే అదనంగా ఇచ్చిన 30 నిమిషాల్లోనూ ఇరు జట్లలో ఎవరూ గోల్ స్కోర్ చేయలేకపోవడంతో విజేతను నిర్ణయించడానికి పెనాల్టీ షూటౌట్‌ని ఎంచుకున్నారు....
కేరళ బ్లాస్టర్స్ జట్లు నాలుగు అవకాశాల్లో ఒకే గోల్ సాధించగా, మూడు గోల్స్ సాధించిన హైదరాబాద్ ఎఫ్‌సీ, ఐఎస్‌ఎల్ 2022 టైటిల్‌ని కైవసం చేసుకుంది.
ఆట మొదలైన మొదటి సగంలో ఇరుజట్ల ఆటగాళ్లు గోల్ చేసేందుకు విశ్వప్రయత్నాలు చేసినా, సఫలం కాలేదు. ఆట 68వ నిమిషంలో గోల్ చేసిన రాహుల్ కేపీ, కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీకి 1-0కి ఆధిక్యం అందించాడు. 20 నిమిషాల పాటు ఆధిక్యంలో కొనసాగిన కేరళ బ్లాస్టర్స్ జట్టు, ఆధిక్యాన్ని కాపాడుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. అయితే ఆట 88 నిమిషంలో అద్భుతమైన గోల్ చేసిన సహిల్ టవోరా... స్కోర్లను 1-1 తేడాతో సమం చేశాడు...
ఆ తర్వాత ఇరు జట్ల ప్లేయర్లు గోల్ చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా, సఫలం కాలేదు. పూర్తి సమయం ముగిసే సమయానికి ఇరు జట్లు సమంగా నిలవడంతో ఫలితాన్ని తేల్చేందుకు మరో 30 నిమిషాలు అదనంగా ఇచ్చారు రిఫరీ. ఆ సమయంలో కూడా ఇరుజట్లు గోల్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు...
పెనాల్టీ షూటౌట్‌లో కేరళ బ్లాస్టర్స్ ప్లేయర్ మార్కో లిస్కోవిక్ కొట్టిన షాట్‌ని హైదరాబాద్ ఎఫ్‌సీ గోల్ కీపర్ లక్ష్మీకాంత్ కట్టిమణి అద్భుతంగా అడ్డుకున్నాడు. హైదరాబాద్ ఎఫ్‌సీ ప్లేయర్ జావో విక్టర్ గోల్ చేయడంతో 1-0 తేడాతో ఆధిక్యం దక్కింది...
ఆ తర్వాత డెనీ నిశు కుమార్ గోల్ చేసేందుకు చేసిన ప్రయత్నాన్ని లక్ష్మీకాంత్ కట్టిమణి అడ్డుకోగా, హైదరాబాద్ ఆటగాడు జెవియర్ సెవెరియో గోల్ పోస్ట్ లోకి బాల్‌ను కొట్టలేకపోయాడు. ఆ తర్వాత కేరళ బ్లాస్టర్స్ ప్లేయర్ అయూష్ అధికారి గోల్ చేసి స్కోర్లను సమం చేశాడు...
అయితే ఆ తర్వాతి ప్రయత్నంలోనే కస్సా చమారా గోల్ చేయడంతో 2-1 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది హైదరాబాద్ ఎఫ్‌సీ. కేరళ బ్లాస్టర్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గోల్ చేయాల్సిన పరిస్థితుల్లో జీక్సన్ సింగ్ గోల్ మిస్ చేశాడు. ఆ తర్వాత హరిచరన్ నర్జరీ గోల్ చేయడంతో పెనాల్టీ షూటౌట్‌లో మరో ఛాన్స్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో టైటిల్ గెలిచి ఛాంపియన్‌గా నిలిచింది హైదరాబాద్ ఎఫ్‌సీ...