Ind Vs SA: రా.. నువ్వో నేనో తేల్చుకుందాం...! గ్రౌండ్ లో బాహాబాహీకి దిగిన బుమ్రా, జాన్సేన్

Jasprit Bumrah Vs Marco Jansen: ఎప్పుడూ కామ్ గా ఉండే జస్ప్రీత్ బుమ్రా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తనను పదే పదే కవ్విస్తున్న  దక్షిణాఫ్రికా పేసర్ జాన్సేన్ తో అతడు  బాహాబాహీకి దిగాడు. 

Ind Vs SA: Jasprit Bumrah And Marco Jansen Engage In War Of Words On Day 3 At Wanderers

ప్రశాంతతకు మారుపేరుగా ఉండే టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో సహనం కోల్పోయాడు. దక్షిణాఫ్రికా యువ పేసర్  జాన్సేన్ తరుచూ అతడికి కవ్వించాడు. దీంతో ఇద్దరూ గ్రౌండ్ లోనే ‘నువ్వెంత..’ అంటే ‘నువ్వెంత..’ అనుకున్నారు. బ్యాటింగ్ చేస్తున్న బుమ్రాను కవ్వించిన జాన్సేన్ దగ్గరకు వచ్చి మరీ మాటల యుద్దానికి దిగారు. రెండో టెస్టు లోని టీమిండియా రెండో ఇన్నింగ్స్ సందర్భంగా వీరిద్దరూ బాహాబాహీకి దిగారు. కాగా  ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఈ ఇద్దరూ టీమ్ మేట్స్ కావడం విశేషం.  

టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో భాగంగా జాన్సేన్ 53వ ఓవర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ఓవర్ లో తొలి బంతిని జాన్సేన్ బౌన్సర్ గా సంధించడంతో అది కాస్తా  బుమ్రా భుజానికి తాకింది. అప్పుడే  జాన్సేన్ ఏదో అనగా బుమ్రా.. భుజం దగ్గర దులుపుకుంటూ ‘చాల్లే వెళ్లు...’ అన్నట్టుగా సైగ చేశాడు. 

 

ఇక ఆ తర్వాత బంతిని కూడా జాన్సేన్ అదే మాదిరిగా విసిరాడు. దీనిని షాట్ గా మలచడంలో విఫలమైన బుమ్రా చేతికి మరోసారి బంతి తాకింది. అయితే ఈసారి కూడా జాన్సేన్.. బుమ్రాను చూస్తూ ఏదో అన్నాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఈ టీమిండియా స్టార్ పేసర్.. నేరుగా జాన్సేన్ దగ్గరకు వెళ్లి.. మాటల యుద్దానికి దిగాడు. ఇద్దరూ కలిసి కొట్టుకునేంత పని చేశారు. దీంతో అక్కడే ఉన్న ఫీల్డ్ అంపైర్లతో పాటు ఇరు జట్ల ఆటగాళ్లు వచ్చి వారికి సర్ది చెప్పారు. వాళ్లను ఎవరి దారిన వారిని పంపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

లక్ష్యం దిశగా దక్షిణాఫ్రికా... 

వాండరర్స్ టెస్టులో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు విజయం దిశగా పయనిస్తున్నది. 240 పరుగుల లక్ష్యంతో నాలుగో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన సఫారీలు.. 27 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 93 పరుగులు చేశారు. ఆ జట్టు ఓపెనర్ మార్క్రమ్ (38 బంతుల్లో 31) క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు.  కానీ శార్దూల్ ఠాకూర్ అతడిని ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేసి భారత శిబిరంలో ఆనందం నింపాడు. ఇక కీగన్ పీటర్సన్ (28) ను అశ్విన్ ఔట్ చేశాడు.  ఓపెనర్ గా వచ్చిన సారథి డీన్ ఎల్గర్ (32 నాటౌట్) తో పాటు డసెన్ (0 నాటౌట్) క్రీజులో ఉన్నారు. చేతిలో మరో 8 వికెట్లు ఉండగా.. రెండు రోజుల ఆట మిగిలుండటంతో దక్షిణాఫ్రికా విజయంపై ధీమాగా ఉంది. అంతకుముందు భారత జట్టు రెండో ఇన్నింగ్స్ లో 266 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా ముందు 240 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios