Russia Ukraine War: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వేదికగా రష్యా చేస్తున్న దురాగతాలపై స్పందించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర అనంతరం తొలిసారి ఐరాస భద్రతా మండలిలో ప్రసంగించారు. రష్యా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య తేడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Russia Ukraine War: ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర అనంతరం.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వేదికగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా బలగాలు.. ఉక్రెయిన్ సర్వనాశనం చేశాయనీ, వారి దాష్టీకాలను తమ దేశం వేదికగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ నగర వీధుల్లో రష్యా సైన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరించాయనీ, తమ పౌరుల మీద నుంచి రష్యా సైనికులు ట్యాంకులను ఎక్కించారని తెలిపారు. అలాగే వారి వేలాది ఉక్రెయిన్ మహిళలపై అత్యాచారాలను పాల్పడ్డారనీ, వారిని అత్యంత దారుణంగా చంపేశారని ఆరోపించారు.
బుచా వేదికగా రష్యా సైనికులు మరణాహోమాన్ని సృష్టించాయనీ, అత్యంత క్రూరంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఇలా ఉక్రెయిన్ పౌరులపై అఘాయిత్యాలకు పాల్పడాలని ఆదేశించిన వారిని అంతర్జాతీయ న్యాయస్థానానికి ఈడ్చుకురావాలని జెలెన్‌స్కీ పరోక్షంగా పుతిన్‌పై విరుచుకుపడ్డారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నుంచి రష్యాను వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉక్రెయిన్ ప్రజలను బానిసలుగా మార్చేందుకు మాస్కో ప్రయత్నిస్తోందని జెలెన్స్కీ పేర్కొన్నారు.
రష్యా యుద్ద ట్యాంకుల కింద ఎంతో మంది ఉక్రెయిన్ పౌరులు నలిగిపోయారనీ, మహిళలు వారి పిల్లల ముందే అత్యాచారానికి గురయ్యారనీ, అత్యంత క్రూరంగా చంపబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. బుచా మరణాకాండ రష్యా సైన్యం క్రూరత్వానికి నిదర్శనమనీ, ఐరాస నియమావళిని రష్యా ఉల్లంఘించిందని ఆరోపించారు. బుచాలో జరిగిన ఊచకోత.. రష్యా చేసిన దారుణంలో ఒకటి మాత్రమేనని పేర్కొన్నారు.
Zelensky ప్రసంగించిన తరుణంలో ఉక్రెయిన్ వీధుల్లో పడి ఉన్న శవాల భయంకరమైన చిత్రాలు, కాలిపోయిన మృతదేహాలు, వివిధ ఉక్రేనియన్ నగరాల్లోని సామూహిక సమాధుల చిత్రాలను చూపించే వీడియోను ప్లే చేయమని కోరారు. చనిపోయిన వారిలో కొందరికి చేతులు వెనుకకు కట్టబడి, పిల్లలతో సహా మహిళల నోరు మూయబడి ఉన్నట్టు అనేక చిత్రాలు వెలుగులోకి వచ్చాయి.
యుద్ధ నేరాలకు పాల్పడుతున్న రష్యా సైన్యాన్ని.. తక్షణమే న్యాయస్థానం ముందుకు తీసుకురావాలని జెలెన్ స్కీ డిమాండ్ చేశారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత రష్యా చేపట్టిన అత్యంత దారుణ చర్యగా అభివర్ణించారు. రష్యా సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య తేడా లేకుండా పోయిందని, తన దేశంలో భద్రత ఎక్కడ ఉందంటూ భద్రతా మండలిని జెలెన్స్కీ ప్రశ్నించారు.
ఇంత జరుగుతున్నా.. ఐరాస ఏం చేస్తుందని నిలదీశారు. ఐక్యరాజ్యసమితిని రద్దు చేయాలని భావిస్తున్నారా అని ప్రశ్నించారు. శాంతి చర్చలకు ముందుకు వచ్చిన రష్యా తమ దేశంలో దాడులు ఆపడం లేదని విమర్శించారు. రష్యా దాడిలో దేశానికి సేవలందిస్తున్న వేలాది మందిని రష్యా సైన్యం మరణించారనీ, తాము వీటోను మరణించే హక్కుగా మార్చే దేశంతో యుద్ధం చేస్తున్నామని, రష్యా ప్రపంచ భద్రతకు భంగం కలిగిస్తుందని జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమ జాతిని, తమ సాంస్కృతిక పద్ధతులను నాశనం చేస్తూ.. చివరికి యుద్ధం వైపు వచ్చాయని అన్నారు. కొందర్ని రోడ్లపైనే హత్య చేశారని, మరి కొందర్ని బావుల్లో విసిరేశారని, ఇళ్లపైకి గ్రెనైడ్లు విసిరారని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. రష్యాపై మరిన్ని కఠినతరమైన ఆంక్షలను విధించాలని ఉక్రెయిన్ డిమాండ్ చేస్తోంది. రష్యా దౌర్జన్యాన్ని ఆపండని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు.
