Asianet News TeluguAsianet News Telugu

వ్యూస్ కోసం యూ ట్యూబర్ అరాచకం.. ఏకంగా విమానాన్ని కూల్చేసి.. వీడియో తీసి...

అమెరికాలో ఓ 29 ఏళ్ల యూట్యూబర్ సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఉద్దేశపూర్వకంగా విమానాన్నే కూల్చేశాడు. అయితే, దీన్ని అక్కడి ఫెడరల్ దర్యాప్తు బృందం చేధించింది. అతనితో నేరాన్ని అంగీకరించేలా చేసింది. 

YouTuber intentionally crashing plane for views in USA - bsb
Author
First Published May 12, 2023, 12:07 PM IST

అమెరికా : ట్రెవర్ డేనియల్ జాకబ్ వాలెట్‌ అనే ఓ యూ ట్యూబర్.. తన వీడియోకు లైకులు, వ్యూస్ కోసం దారుణానికి ఒడిగట్టాడు. యూట్యూబ్ వీడియోల కోసం ఎంతకైనా తెగించడానికి వెనకాడడం లేదు యూట్యూబర్లు. వీరందరి కంటే ఓ అడుగు ముందుకు వేసి ఓ ఘనుడు ఏకంగా విమానాన్ని కూల్చేశాడు. అయితే దీని మీద అధికారులు విచారణ చేపట్టగా.. వారి దర్యాప్తులో  సదరు యూట్యూబ్ తనకేం తెలియదని.. ఇంజన్ ఫెయిల్ అవ్వడంతోనే విమానం కూలిపోయిందని బుకాయించాడు.  

కానీ, అధికారులు వదలలేదు. ఆధారాలతో అతడిని ప్రశ్నించేసరికి విమానాన్ని తానే కూల్చేసినట్లుగా ఒప్పుకోక తప్పలేదు. ట్రెవొర్ జాకబ్ అనే యూట్యూబర్ అమెరికాలోని ఒలంపిక్స్ స్నోబోర్డు క్రీడాకారుడు. అమెరికా తరఫున 2014లో రష్యాలోని సోచీలో జరిగిన వింటర్ ఒలంపిక్స్ స్నో బోర్డులో సెమీఫైనల్స్ వరకు వెళ్ళాడు జాకబ్.  ఆ తర్వాత జరిగిన పలు అంతర్జాతీయ టోర్నమెంట్లలో కూడా జాకబ్ పాల్గొన్నాడు. అతనికి సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈ ఛానల్ లో అతని ఎక్కువగా స్కై డైవింగ్, ఏవియేషన్,  స్నో బోర్డింగ్ కు సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేస్తాడు. 

ఇవి చాలా ఆసక్తిగా ఉంటుండడంతో ఇతని ఛానల్ కి లక్షలాది మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. 2021 నవంబర్ 24న మరణించిన తన స్నేహితుడి చితాభస్మాన్ని వెదజల్లాలని చెప్పి లోంపోక్ విమానాశ్రయం నుంచి ఓ పాత సింగిల్ ఇంజిన్ లైట్ ఎయిర్ క్రాఫ్ట్ అద్దెకు తీసుకుని ఒంటరిగా బయలుదేరాడు. ఈ క్రమంలో లాస్ పాడ్రెస్ నేషనల్ పార్క్ పైనుంచి ఎయిర్ క్రాఫ్ట్ ఎగురుతుండగా ఒకసారిగా కూలిపోయింది. అయితే అందులో ఉన్న ట్రెవొర్ పారాషూట్ సహాయంతో తప్పించుకున్నాడు. అతనికి స్వల్ప గాయాలయ్యాయి. అందరూ ఇది ప్రమాదం అనే మొదట అనుకున్నారు.

కాగా, 2021 డిసెంబర్ 24వ తేదీన అంటే సరిగ్గా ప్రమాదం జరిగిన నెల రోజులకి అతని యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియో ప్రత్యక్షమైంది. దాని టైటిల్  ‘నేను విమానాన్ని కూల్చి వేశాను’ అని ఉంది. అందులో విమానం ఇంజిన్ లో సమస్యలు తలెత్తాయని దీంతో తాను పారాచూట్ సహాయంతో బయటకు దూకాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. అయితే, అతను బయటికి దూకే సమయంలో సెల్ఫీ స్టిక్ పట్టుకొని ఉండడం కనిపిస్తుంది.

దీంతోపాటు విమానం లాస్ పాడ్రేస్ నేషనల్ పార్క్ సమీపంలో కూలడాన్ని కూడా అందులో పూర్తిగా చిత్రీకరించాడు. విమానంలో పలుభాగాల్లో కెమెరాలు అమర్చి.. ఈ ప్రమాదాన్ని చిత్రీకరించాడు. వీడియో చివర్లో... ‘ఈ ప్రమాదం నుంచి నేను సురక్షితంగా బయటపడినందుకు ఎంతో సంతోషిస్తున్నాను’ అని చెప్పుకొచ్చాడు.  ఆ తర్వాత విమాన శిధిలాల వద్దకు చేరుకుని వాటిని కూడా వీడియో తీశాడు. విమానంలో అమర్చిన కెమెరాలు నుంచి డేటా పూర్తిగా తీసుకున్నాడు.

అయితే ఈ విమాన ప్రమాదం మీద కొద్ది రోజుల తర్వాత ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది. ఆ విమాన శకలాలు ఎక్కడ ఉన్నాయో చెప్పమని అడగగా..  అది ఎక్కడ ఉన్నాయో తనకు తెలియదని ట్రెవొర్ తెలిపాడు. ఆ తర్వాత ఓ హెలికాప్టర్లో తన మిత్రులతో కలిసి ప్రమాద స్థలానికి వెళ్లి విమాన శకలాలను వేరే ప్రదేశానికి మార్చాడు.  వాటిని ధ్వంసం చేశాడు. ఆ తర్వాత మిగిలిన విమాన భాగాలను విమానాశ్రయం, మరి ఇతర ప్రదేశాల్లోని చెత్తలో పడేశాడు. దీని మీద అప్పటినుంచి దర్యాప్తు చేస్తున్న ఫెడరల్ దర్యాప్తు బృందం 2022లో విమానాన్ని ట్రెవొర్  ఉద్దేశపూర్వకంగానే కూల్చివేశాడని నిర్ధారించింది. అతను లోంఫోక్ విమానాశ్రయానికి వచ్చేటప్పుడే భారీ పారా చ్యూట్ తో వచ్చాడని గుర్తించింది. 

విమానాశ్రయంలో ఉన్నవారు చిన్న సీటు విమానంలో పారాచూట్ ఇబ్బందికరంగా ఉంటుందని తెలిపారు. అతని విమానానికి  ముందే కేమెరాలు అమర్చినట్లు కూడా చెప్పుకొచ్చారు. ఎట్టకేలకు ట్రెవొర్ ఫెడరల్ దర్యాప్తు బృందం ఎదుట తప్పును అంగీకరించాల్సి వచ్చింది. దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించినట్లు అంగీకరించాడు. ఉద్దేశపూర్వకంగానే విమానాన్ని కూల్చివేసినట్లు ఒప్పుకున్నాడు. ఇక ఈ కేసులో ట్రెవొర్ కు 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios