బీజింగ్:  ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ను తొలుత గుర్తించిన చైనా వైద్యుడు గురువారంనాడు మరణించారు. లీ వెన్ లియాంగ్ అనే ఆ వైద్యుడు ఫిబ్రవరి 1వ తేదీన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయు)లో చేరారు. గురువారం ఉదయం ఆయన మరణించినట్లు వూహన్ ఆస్పత్రి ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆయన మృతికి సంతాపం ప్రకటించింది. 

నేత్ర వైద్యుడైన లీ వెన్ లీయాంగ్ తన వద్దకు వచ్చిన ఓ రోగిలో డిసెంబర్ 30వ తేదీన కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించారు. సార్స్ తరహా వైరస్ ఆనవాళ్లను గుర్తించానని ఆయన తన మిత్రులకు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఆ మెసేజ్ వైరల్ కావడంతో వైరస్ విషయం వెలుగులోకి వచ్చింది. 

అవాస్తవాలతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారంటూ మొదట లీని పోలీసులు అరెస్టు చేశారు. కేవలం మిత్రులకు మాత్రమే చెప్పాలని అనుకున్నట్లు, ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం తన ఉద్దేశం కానట్లు ఆయన తెలిపారు. అయినా వారు వినిపించుకోలేదు. అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారు. చివరకు రెండు వారాల తర్వాత వదిలేశారు. 

ఆ తర్వాత తిరిగి విధుల్లో చేరి కరోనా వైరస్ రోగులకు చికిత్స చేయడం ప్రారంభించారు. ఆయనకు వైరస్ సోకినట్లు జనవరి రెండో వారంలో గుర్తించారు. దాంతో ఫిబ్రవరి 1వ తేదీన ఐసీయులో చేరి గురువారం తుదిశ్వాస విడిచారు. లీని అరెస్టును సుప్రీం పీపుల్స్ కోర్టు తప్పు పట్టింది. అతని సందేశంలోని నిజానిజాలను తేల్చుకోవడానికి ప్రయత్నించి, విశ్వసించి ఉంటే మేలు జరిగి ఉండేదని వ్యాఖ్యానించింది.