కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ప్రతి రోజూ వేలాది సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షల మంది వైరస్ బారిన పడుతున్నారు. ఈ వైరస్ కి వ్యాక్సిన్ ఎప్పుడు దొరికుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రష్యా ఇప్పటికే వ్యాక్సిన్ కొనుగొన్నా.. అది ఇంకా అందుబాటులోకి రాలేదు. 

అయితే.. ఈ నేపథ్యంలో మలేషియాలో దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మలేషియాలో కరోనా వైరస్‌ కొత్త జాతిని గుర్తించిన శాస్త్రవేత్తలు, ఇది ప్రస్తుతం ఉ‍న్న వైరస్‌ కంటే 10 రెట్లు ప్రమాదకరమైనదిగా వెల్లడించారు. మలేషియాలో తాజాగా వెలుగు చూసిన కొన్ని కేసుల్లో వేగంగా వ్యాప్తి చెందేలా కరోనా వైరస్‌ మార్పుకు గురయినట్లు సంకేతాలు వెలువడుతున్నాయని అమెరికా అంటువ్యాధి నిపుణుడు డాక్టర్‌ ఆంథోనీ ఫౌసీ హెచ్చరించారు.

ఇలా పరివర్తనం(మార్పు) చెందిన కరోనా వైరస్‌కు ‘డీ614జీ’గా నామకరణం చేశారు. ఇందుకు సంబంధించి బ్లూమ్‌బర్గ్‌ ఓ నివేదిక విడుదల చేసింది. మలేషియాలోని ఓ రెస్టారెంట్‌ యజమాని నుంచి ప్రారంభైన క్లస్టర్‌లో 45 కేసులు వెలుగు చూడగా.. వాటిలో​ మూడు కేసులలో ఈ ‘డీ614జీ’గా పిలవబడే పరివర్తన కరోనా వైరస్‌ను గుర్తించారు. 

గత ఏడాది డిసెంబర్‌లో చైనాలోని వుహాన్‌లో కరోనా వైరస్‌ మొదటిసారిగా వెలుగుచూసింది. అప్పటి నుంచి శాస్త్రవేత్తలు కరోనావైరస్ జన్యు పదార్ధంలో ఉత్పరివర్తనలు, మార్పులను గుర్తించారు. ఐరోపా, అమెరికాల్లో వైరస్ మ్యుటేషన్‌కు గురైనప్పటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ జాతి మరింత తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుందని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది.