మార్చురీలో వింత: చనిపోయిందనుకున్న మనిషి బతికింది

First Published 4, Jul 2018, 7:09 PM IST
women found live in mortury
Highlights

చనిపోయిందని మార్చురీలో పెట్టిన ఓ మహిళ మూడు రోజుల పాటు కొన ఊపిరితో కనిపించడం మిస్టరీగా మారింది. జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 

ఒక మృతదేహాన్ని మార్చురీలో పెట్టారంటే వాళ్లు చనిపోయినట్లే లెక్క.. కానీ అలాంటి మార్చురీలో ఓ వింత జరిగింది. చనిపోయిందని వైద్యులు ధ్రువీకరించిన ఓ మహిళ మృతదేహాన్ని మార్చురీలో ఉంచగా.. మూడు రోజుల తర్వాత ఆమె ప్రాణాలతోనే ఉన్నట్లు గుర్తించారు అక్కడి సిబ్బంది.. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గత నెల 24న ఓ మహిళ కారు ప్రమాదంలో తీవ్ర గాయాలతో కార్లెటన్ విల్లే ఆసుపత్రిలో జాయిన్ అయ్యింది. ఆమెను పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు ధ్రువీకరించారు. ఆమె వివరాలు తెలియకపోవడం.. ఎవరూ రాకపోవడంతో..  మార్చురీలో భద్రపరిచారు.

ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత మార్చురీలో చిన్న శబ్ధం వినిపించింది. అక్కడికి వెళ్లి చూస్తే సదరు మహిళ బతికే ఉంది. వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తరలించి ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. ఆమె బతకడం అక్కడివారిని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. మార్చురీ గదిలో గాలి కూడా జోరబడలేనంత పకడ్బంధీగా మృతదేహాలను భద్రపరుస్తారు. అలాంటి చోట గాలి కూడా సరిగా ఆడదు..మరి ఆమె ఎలా బ్రతికింది అన్నది మిస్టరీగా మారింది.

loader