కెంటకీలోని ఒక ఇంటి అంతస్తులో ఓ మహిళను రెండు రోజుల పాటు బంధించారు. ఈ విషయం తెలియడంతో పోలీసులు ఆమెను రక్షించారు. ఈ దృశ్యాలన్నీ బాడీక్యామ్‌లో రికార్డు చేశారు.
అమెరికా : అమెరికాలో అత్యంతా దారుణమైన ఘటన వెలుగు చూసింది. కెంటకీలో ఓ ఇంటి పై అంతస్తులో మహిళను గొలుసులతో బంధించారు. ఈ సమాచారాన్ని పోలీసులకు తెలియడంతో వారు ఆమెను రక్షించారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెడితే..
బుధవారం ఆ ఇంట్లోనుంచి మహిళ అరుపులు వినిపించడంతో పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ సమాచారంతో రాత్రి 7 గంటల ప్రాంతంలో లూయిస్‌విల్లే మెట్రో పోలీసు అధికారులు అక్కడికి చేరుకున్నారు. భవనంలోకి ప్రవేశించేందుకు తలుపులు, కిటికీలను బద్దలు కొట్టారు. ఆ తరువాత ఇంట్లోకి ప్రవేశించారు. అయితే ఇల్లు పూర్తిగా బారికేడ్ చేయబడిందని పోలీసులు తెలిపారు.
పుతిన్ పై తిరుగుబాటు చేసిన వాగ్నర్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ దుర్మరణం.. అసలేం జరిగిందంటే ?
కొద్దిసేపటి తరువాత, రెండవ అంతస్తుకు చేరుకోవడానికి పోలీసు అధికారులు నిచ్చెన ఉపయోగించారు. అక్కడ కిటికీ విరిగిపోయి కనిపించింది. పోలీసులు అక్కడికి చేరుకునేసరికి అక్కడ ఓ మహిళ భయంతో వణికిపోతూ.. ఏడుస్తూ కనిపించింది. మహిళను గొలుసులతో బంధించారు. మెడకు గొలుసులతో తాళాలు వేశారు. ఆ గొలుసులను ఫ్లోరింగ్ కు అమర్చిన బోల్డులతో బంధించారు. మెడకు మాస్టర్‌లాక్ చేశారు.
నేలకు బోల్ట్ చేసిన స్క్రూలను, గొలుసును పోలీసులు గొడ్డలితో పగలగొట్టారు. బోల్ట్ కట్టర్‌లను ఉపయోగించి మహిళ మెడకున్న తాళాన్ని గొలుసులను తెగ్గొట్టారు. ఈ దారుణానికి పాల్పడింది మోయిసెస్ మే (36)గా అనుమానిస్తున్నారు. రెండు రోజుల తర్వాత అతడిని అరెస్టు చేశారు. మహిళతో జరిగిన వాదన హింసాత్మకంగా మారడంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది.
ఘటనకు ముందు రోజు రాత్రి వారిద్దరి మధ్య వాదన జరిగింది. దీంతో ఆ రాత్రి ఆమె అక్కడినుంచి వెళ్లిపోయింది. అయితే మరుసటి రోజు తన వస్తువులు తీసుకువెళ్లేందుకు తిరిగి వచ్చిందని నివేదికలు పేర్కొన్నాయి. నిందితుడు ఆమెను డెడ్‌బోల్ట్ చేసిన గదిలోకి లాక్కెళ్లి ఆమె ఫోన్ తీసుకున్నాడు.
బిడ్డ విషయంలో గొడవ జరిగిఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆమెను డెడ్ బోల్ట్ గదిలోకి లాక్కెళ్లిన తరువాత ఆమె జుట్టును కొడవలితో కట్ చేశాడు. ఆ తరువాత నేలపై కూర్చోవాలని బెదిరించి.. బలవంతంగా ఒంచి.. గొలుసులతో బంధించాడు. ఆ తరువాత "నువ్వు ఈ రాత్రికి ఐపోతావు.. నువ్వు మళ్లీ ఇంటికి రావద్దు. వస్తే నేను నిన్ను చంపేస్తాను" అని మే ఆమెతో చెప్పినట్లు పోలీసు నివేదికలో పేర్కొంది.
నిందితుడు మే మీద కిడ్నాప్ చేయడం, బెదిరించడం, అపాయం కలిగించడం, దాడి చేయడం, తీవ్రవాద బెదిరింపులు, వేధింపులకు పాల్పడినట్లు చట్టపరమైన ప్రక్రియలో అభియోగాలు మోపినట్లు తెలుస్తోంది. అతనికి 100,000 డాలర్ల బాండ్ విధించారు. ఆగస్టు 28న కోర్టులో అతను మళ్లీ హాజరు కావాల్సి ఉంది.
