కరోనా వైరస్ ప్రపంచదేశాలను వణికిస్తోంది.  తాజాగా ఈ మహమ్మారి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్య సోఫీ గ్రెగొరీకి కూడా సోకింది. ఈ విషయాన్ని కెనడా ప్రధాని కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. గురువారం ఆమెకు వైరస్ కి సంబంధించిన లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు.

లక్షణాలు గుర్తించినప్పటి నుంచి ఆమె ఇంటికే పరిమితమయ్యారు. ట్రూడో సైతం ఇంటి నుంచే విధులు నిర్వహిస్తుండటం గమనార్హం. తన భార్యకు వైరస్ లక్షణాలు స్వల్పంగా ఉండడంతో ఇంటికే పరిమితం కావాలని నిర్ణయించుకున్నట్లు ప్రధాని ట్రూడో తెలిపారు.

Also Read భారత్ లో తొలి కరోనా మరణం.. హైదరాబాద్ లో కర్ణాటక వ్యక్తి మృతి

సోఫీ ఇటీవల బ్రిటన్ లోని ఓ కార్యక్రమానికి హాాజరై వచ్చారు. అక్కడే ఆమెకు వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. అయితే.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని.. వైద్యుల సలహా మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ట్రూడో కమ్యూనికేషన్ డైరెక్టర్ కామెరూన్ అహ్మద్ వెల్లడించారు.

లక్షణాలు స్వల్ప స్థాయిలోనే ఉన్నాయని చెబుతున్నారు.  ప్రధాని ట్రూడో మాత్రం పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. గత కొన్ని రోజుల్లో సోఫీని కలిసిన వారందరికీ పరీక్షలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.వైద్యుల సూచనల మేరకు రానున్న 14 రోజులపాటు ప్రధాన ట్రూడో ఇంటికే పరిమితం కానున్నారని అధికారులు చెప్పారు.