కెనడా పార్లమెంట్ ఎన్నికల్లో లిబరల్ పార్టీ విజయం దాదాపు ఖరారైంది. దీంతో మార్క్ కార్నే తన ప్రధాని పదవిని సుస్థిరం చేసుకోనున్నారు. ట్రూడో ప్రధానిగా తప్పుకున్న తర్వాత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మార్క్.. ఇప్పుడు ప్రజాభిప్రాయంతో ప్రధానిగా కొనసాగనున్నారు. ఈ నేపథ్యంలో అసలు మార్క్ కార్నే ఎవరు.? ఆయన నేపథ్యం ఏంటి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
బాల్య జీవితం:
మార్క్ కార్నీ నార్త్ వెస్ట్ టెర్రిటరీస్‌లోని ఫోర్ట్ స్మిత్‌లో జన్మించారు. ఆయనకు ఐరిష్ మూలాలు ఉన్నాయి. ఆయనకు ఐరిష్, కెనడియన్ పౌరసత్వాలున్నాయి. 2018లో బ్రిటిష్ పౌరసత్వం కూడా తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన ప్రధానిగా కేవలం కెనడా పౌరసత్వం ఉండాలని భావిస్తూ మిగిలిన పౌరసత్వాలను వదులుకునేందుకు సిద్ధమవుతున్నారు. మార్క్ విద్యాభ్యాసం విషయానికొస్తే ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో చదివారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు.
ఉద్యోగ జీవితంలో అనుభవం:
2003లో కార్నీ ప్రైవేట్ రంగాన్ని వదిలి బ్యాంక్ ఆఫ్ కెనడాలో చేరారు. 2007లో గవర్నర్ అయ్యారు. 2008 ఆర్థిక మాంద్యంలో కెనడాను చక్కదిద్దిన నేతగా పేరుగాంచారు. అనంతరం 2013లో బ్రిటన్‌కి వెళ్లి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ అయ్యారు. ఆయన విధానాలు ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేందుకు కీలకమయ్యాయి.
ట్రంప్‌తో సంబంధాలు:
ట్రంప్ పాలనలో ట్రేడ్ పాలసీలకు వ్యతిరేకంగా కార్నీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిరక్షణలో భాగమయ్యారు. ఇప్పుడు ట్రంప్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కెనడాపై మళ్లీ ఆంక్షలు వేస్తుండటంతో కార్నీ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
రాజకీయ జీవితం:
రాజకీయ జీవితం విషయానికొస్తే లిబరల్ పార్టీకి చాలా చేరువయ్యారు. ఈ క్రమంలోనే జస్టిన్ ట్రూడో రాజీనామా చేసిన తర్వాత పార్టీ నాయకత్వాన్ని స్వీకరించారు. పన్నులు తగ్గింపు, వాణిజ్య సమస్యలు పరిష్కారంపై ఆయన నమ్మకంగా ఉన్నారు. తాను ప్రధాని అయిన తర్వాత కార్బన్ టాక్స్ తొలగించారు. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇచ్చారు. ఇమ్మిగ్రేషన్ టార్గెట్లపై నియంత్రణ విధించారు. అమెరికాతో ట్రేడ్‌ను సమతుల్యం చేసే విధానాలను అమలు చేశారు.
మొత్తం మీద మార్క్ కార్నీకి పెద్దగా రాజకీయ అనుభవం లేకపోయినా ఆర్థిక రంగంలో గొప్ప అనుభవం ఉంది. ట్రంప్‌కి గట్టి సమాధానం ఇవ్వగల నాయకుడిగా ప్రజల్లో విశ్వాసం పెరగాలనుకుంటున్నారు.
