Asianet News TeluguAsianet News Telugu

ఐదు సార్లు పెళ్లికి నిరాకరణ: జ్యో బైడెన్ భార్య, ఎవరీ జిల్ బైడెన్?

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ భార్య జిల్ ప్రథమ మహిళ కానున్నారు. ఆమె ప్రాథమికంగా ఉపాధ్యాయురాలు. ఆమెకు బోధన అంటే ఇష్టం. ప్రథమ మహిళ అయినా కూడా తాను టీచింగ్ కొససాగిస్తానని చెప్పారు.

Who is Joe Biden's wife Jill? Who could be the next US first lady
Author
Washington D.C., First Published Nov 8, 2020, 8:08 AM IST

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ సతీమణి పేరు జిల్ బైడెన్. అమెరికాకు కాబోయే ప్రథమ మహిళ ఆమె. అంటే ఫ్లోటస్. అమెరికాలో ఫ్లోటస్ కు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. అధ్యక్షుడితో కలిసి పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేశవిదేశాల్లో కలిసి పర్యటనలు చేస్తుంటారు. 

ఫిలడెల్ఫియాకు చెందిన జిల్ 1951లో జన్మించారు. 1970లో బిల్ స్టీవెన్సన్ ను వివాహం చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత ఆయనతో విడిపోయారు. జో బైడెన్ ను ఆమె తొలిసారి 1975లో కలిశారు. ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అప్పటికి బైడెన్ వివాహితుడు. 

అయితే, బైడెన్ ది విషాద గాథ. ఆయన భార్య నీలియా 1972లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఆ ప్రమాదంలో తన ఏడాది పాపను కూడా ఆయన కోల్పోయారు. ఇద్దరు కుమారులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. వారిని ఆయనే చూసుకుంటూ వస్తన్నారు. ఈ క్రమంలో బైడెన్ జిల్ ముందు పెళ్లి ప్రతిపాదన పెట్టాడు. ఆమె ఇప్పుడు కాదంటూ సున్నితంగా తిరస్కరించారు. 

జిల్ నుంచి బైడెన్ ఐదుసార్లు తిరస్కరణ ఎదురైంది. అయితే, చివరకు ఆమె అంగీకరించింది. దీంతో 1977లో వారు వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి వారి వివాహ బంధం కొనసాగుతూనే ఉంది. 

జిల్ డాక్టరేట్ చేశారు. వృత్తి రీత్యా టీచర్. మొదట 13 ఏల్ల పాటు వివిధ పాఠశాలల్లో ఇంగ్లీష్ టీచర్ గా పనిచేశారు. ఆ తర్వాత కొన్ని కళాశాలల్లో పనిచేశారు. బైడెన్ ఉపాధ్యక్షుడు అయిన తర్వాత ఆమె అమెరికా ద్వితీయ మహిళ స్థానం పొందారు. దాంతో ఆమె వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వచ్చేది. అయినా కూడా ఆమె బోధనను వదలలేదు. 

వర్జీనియాలోని ఓ కళాశాలలో పాఠాలు చెబుతూనే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. చాలాసార్లు ఎయిర్ ఫోర్స్ -2 లో ప్రయాణిస్తూ విద్యార్థుల ప్రశ్న పత్రాలు దిద్దేవారు. ఎయిర్ ఫోర్స్ -2 అమెరికా ఉపాధ్యక్షుడు వాడే విమానం. తన భర్తకు అధ్యక్ష పదవి దక్కినా కూడా తాను విద్యార్థులకు పాఠాలు చెబుతూనే ఉంటానని గతంలో ఆమె చెప్పారు. 

నీలియా మరణం తర్వాత తాను ఎంతో కుంగిపోయానని, జిల్ తనకు మామూలు మనిషిని చేసిందని బైడెన్ అంటుంటారు. తనకు తన జీవితాన్ని ఆమె తిరిగి ఇచ్చిందని అంటారు. తన గురించి తనకన్నా జిల్ కే ఎక్కువ తెలుసునని చెబుతుంటారు. ఉపాధ్యక్ష పదవికి మహిళా అభ్యర్థిని ఎన్నుకునే సమయంలో కమలా హారిస్ పేరును ఆమెనే సూచించినట్లు చెబుతారు.

ఎన్నికల ప్రచారంలో జిల్ బైడెన్ వెంటే ఉన్నారు. పలు ర్యాలీల్లో పాల్గొన్నారు. జీల్ కు పరుగు అంటే కూడా చాలా ఇష్టం. వారానికి కనీసం ఐదు రోజులు రన్నింగ్ చేస్తారు. పలు హాఫ్ మారథాన్లు, 10 మైళ్ల పరుగు పోటీల్లో పాల్గొన్నారు. 1998లో ఓ మారథాన్ నూ పూర్తి చేశారు. బైడెన్ బాల్యం గురించి ది స్టోరీ ఆఫ్ జో బైడెన్ అనే పుస్తకం రాశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios