విమానంలో గాలిలో ఎగురుతున్న సమయంలోనే పైలట్ అస్వస్థతతో మరణించాడు. దీంతో కో పైలట్ అప్రమత్తమై విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. పైలట్ ను రక్షించేందుకు వైద్య సిబ్బంది ఎంతో ప్రయత్నించినా.. ఆయనను కాపాడలేకపోయారు. 

ఓ విమానం గాలిలో ఉండగానే దానిని నడుపుతున్న పైలట్ లలో ఒకరు బాత్ రూమ్ పడి చనిపోయారు. దీంతో ఫ్లైట్ లో ఉన్న సిబ్బంది, ప్రయాణికులు కంగారు పడ్డారు. దీంతో కో-పైలట్ అప్రమత్తమై విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన పనామాలో ఆదివారం రాత్రి జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

వివరాలు ఇలా ఉన్నాయి. లాటమ్ ఎయిర్ లైన్స్ కు చెందిన కమర్షియల్ విమానం 271 మంది ప్రయాణికులతో మియామీ నుంచి చిలీకి ఆదివారం బయలుదేరింది. అయితే విమానం టేకాఫ్ అయిన మూడు గంటల తరువాత 56 ఏళ్ల పైలట్ కెప్టెన్ ఇవాన్ అండౌర్ అస్వస్థతకు గురయ్యారు. ఆ పైలట్ కు 25 ఏళ్ల అనుభవం ఉంది. అయితే ఆయన బాత్ రూమ్ కు వెళ్లిన సమయంలో తీవ్ర అస్వస్థతకు గురై అక్కడే పడి చనిపోయారు. 

కొంత సమయం తరువాత సిబ్బంది దీనిని గమనించారు. వెంటనే ఇవాన్ అండౌర్ కు అత్యవసర చికిత్స అందించారు.అయితే పైలట్ ను బతికించాలనే ఉద్దేశంతో కో- పైలట్ విమానాన్ని పనామా సిటీలోని టోక్యుమెన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారని ‘ఇండిపెండెంట్ న్యూస్’ పేర్కొంది. వెంటనే వైద్య నిపుణులు హుటాహుటిన వచ్చారు. కానీ పైలట్ ను పరీక్షించగా.. అప్పటికే మరణించాడని ప్రకటించారు. 

Scroll to load tweet…

‘‘ మియామి-శాంటియాగో మార్గంలో ప్రయాణిస్తున్న ఎల్ ఏ505 విమానం కమాండ్ సిబ్బందిలోని ముగ్గురు సభ్యుల్లో ఒకరికి మెడికల్ ఎమర్జెన్సీ ఏర్పడింది. అందుకే విమానాన్ని పనామాలోని టోక్యుమెన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది’’ అని లాటమ్ ఎయిర్ లైన్స్ గ్రూప్ నివేదించింది. పైలట్ ను కాపాడేందుకు సిబ్బంది ప్రయత్నించారని, కానీ దురదృష్టవశాత్తు ఆయన మరణించాడని విమానయాన సంస్థ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. 

‘‘ఈ ఘటన మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. తమ ఉద్యోగి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామం. ఆయన 25 సంవత్సరాల కెరీర్, అతడి విలువైన సహకారానికి మేము చాలా కృతజ్ఞులం. ఆయన ఎల్లప్పుడూ అంకితభావంతో పని చేశారు. విమాన ప్రయాణంలో బాధిత పైలట్ ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన అన్ని భద్రతా ప్రోటోకాల్స్ ను పాటించాం’’ అని ఎయిర్ లైన్స్ పేర్కొంది.