ఆ పిల్లలు గుహలో ఇంకొన్ని రోజులుంటే ఏం జరుగుతుందో తెలుసా?

What Happens When You Stay In Cave For More Days
Highlights

ఈ గుహ నుంచి పిల్లలను బయటకు తీసుకురావటమే ఇప్పుడు పెద్ద సమస్య. ప్రస్తుతం ఈ పిల్లలంతా ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ, వీరు ఇంకొంత కాలం గుహలోనే ఉండాల్సి వస్తే, వారు బయటకు వచ్చిన

థాయ్‌లాండ్ గుహల్లో అదృశ్యమైన 12 మంది విద్యార్థులు మరియు వారి ఫుట్‌బాల్ కోచ్‌ను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు వీలైన ప్రతి మార్గాన్ని అధికారులు అన్వేషిస్తున్నారు. ఈ విషయంలో తొందరపడి ఏదో ఒక నిర్ణయం తీసుకోలేమని, ఆచితూచి అడుగేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. చుట్టూ నీటితో నిండిపోయిన గుహలో చిక్కున్న విద్యార్థులను పలకరించేందుకు వచ్చిన రెస్క్యూ టీమ్ తీసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది.

గజ ఈతగాళ్లతో కూడిన ఓ రెస్క్యూ టీమ్ ఇప్పటికే ఆ బాలురున్న చోటుకు చేరుకొని, వారికి కావల్సిన మందులు, ఆహార పధార్థాలను అందజేశారు. ఈ రెస్క్యూ టీమ్‌లో ఓ వైద్యుడు, ఓ నర్సుతో పాటుగా మరో ఐదుగురు ఉన్నారు. ఆ వీడియోలో పిల్లలందరూ నవ్వుతూ, ఒక్కక్కరుగా తమను తాము పరిచయం చేసుకున్నారు. వారంతా ఒకరి తర్వాత మరొకరు మాట్లాడుతూ, తమ పేర్లు చెప్పి థాయ్ సంప్రదాయ పద్ధతిలో హాయ్ చెప్పారు. ఈ వీడియో చూసిన కుటుంబ సభ్యులకు ఆందోళన నుంచి ఊరట లభించింది.

ఈ గుహ నుంచి పిల్లలను బయటకు తీసుకురావటమే ఇప్పుడు పెద్ద సమస్య. ప్రస్తుతం ఈ పిల్లలంతా ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ, వీరు ఇంకొంత కాలం గుహలోనే ఉండాల్సి వస్తే, వారు బయటకు వచ్చిన తర్వాత కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుహలో ఎక్కువ రోజులు ఉండటం వలన కలిగే సమస్యలేంటో వైద్యులు వివరించారు. అవేంటంటే..

చిమ్మ చీకటిగా ఉన్న గుహలో ఎక్కువ రోజుల ఉండటం వలన, వీరు బయటకు రాగానే వెలుతురిని నేరుగా చూడలేరు. ఒకవేళ చూస్తే కంటి రెటీనా పొర దెబ్బతినే ప్రమాదం ఉంది. గుహలో ఆక్సిజెన్ లెవల్స్ తక్కువగా ఉండటం, బయటి గాలిలా నాణ్యత లేకపోవటం వలన ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు.

సరైన పౌష్టికారం లేకపోవటం వలన బరువు తగ్గటం, ఆకలి వలన చాలా వేగంగా ఆహారం తినటం వలన గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వెద్యులు చెబుతున్నారు. మరోవైపు బురదతో కూడిన చిత్తడి వాతావరణంలో ఎక్కువ రోజులు గడపటం వలన పిల్లలకు చర్మ సంబంధిత వ్యాధులు కూడా వచ్చే ఆస్కారం ఉందని అంటున్నారు. 

loader