Asianet News TeluguAsianet News Telugu

యూకే పీఎం రేసులో లిజ్ ట్రస్‌పై ఓడిన తర్వాత రిషి సునాక్ ఏమన్నాడంటే?

యూకే పీఎం రేసులో టిజ్ ట్రస్ చేతిలో భారత సంతతి రిషి సునాక్ ఓడిపోయాడు. అనంతరం, ఆయన తనకు ఓటు వేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే, లిజ్ ట్రస్ నాయకత్వంలో తామంతా కలిసే ఉంటామని వివరించారు.

we now unite behind the new pm liz truss says rishi sunak after his defeat
Author
First Published Sep 6, 2022, 1:53 AM IST

న్యూఢిల్లీ: యూకే వాసులతోపాటు భారతీయులు ఆసక్తిగా చూసిన కన్జర్వేటివ్ లీడర్షిప్ రేస్ ముగిసింది. పార్టీ లీడర్‌గా రిషి సునాక్ పై లిజ్ ట్రస్ గెలిచారు. అనంతరం.. ఆమె యూకే ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకోనున్నారు. రిషి సునాక్ పీఎం పోస్టు కోసం శాయశక్తులా ప్రయత్నించారు. కానీ, పరాజయం పొందారు. లిజ్ ట్రస్ పై ఆయన ఓడిపోగానే నిమిషాల వ్యవధిలోనే ఆయన స్పందించారు. 

‘నేను మొదటి నుంచీ కన్జర్వేటివ్‌లు అందరూ ఒకే కుటుంబం అని చెబుతూ వస్తున్నా. కఠిన పరిస్థితుల గుండా దేశాన్ని లిజ్ ట్రస్ ముందుకు తీసుకెళ్లతారు. ఆమె నాయకత్వంతో మేమంతా ఐక్యంగా ఉంటాం’ అని ట్వీట్ చేశారు.

లిజ్ ట్రస్ పై రిషి సునాక్ ఓడిపోగానే ట్విట్టర్ వేదికను ఆశ్రయించి తనకు ఓటు వేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. 

బ్రిటన్ ప్రధానిగా ఇది వరకు ఇద్దరు మహిళలు సేవలు అందించారు. వారు మార్గరెట్ థాచర్, థెరిసా మే. వీరి తర్వాత మూడో మహిళా ప్రధానిగా లిజ్ ట్రస్ చరిత్ర పుటల్లోకి ఎక్కనున్నారు. మంగళవారం ఆమె ప్రధానిగా బాధ్యతలు తీసుకోనున్నారు.

బోరిస్ జాన్సన్ పీఎం పదవికి రాజీనామా చేశాక.. ఆపద్ధర్మ పీఎంగా కొనసాగుతున్నారు. దీంతో కన్జర్వేటివ్ పార్టీ మరో ప్రధానమంత్రిని ఎన్నుకోవాల్సి వచ్చింది. పార్టీ నాయకత్వ రేసులో మొదటి నుంచి రిషి సునాక్, లిజ్ ట్రస్‌ల మధ్య గట్టి పోటీగానే కనిపించింది.

కన్జర్వేటివ్ పార్టీలో 1,72,437 మంది అర్హులైన ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నిక కోసం ఇందుల నుంచి 82.6 శాతం మంది ఓటేశారు. ఇందులో లిజ్ ట్రస్‌కు 81,326 ఓట్లు, రిషి సునాక్‌కు 60,399 ఓట్లు పోలయ్యాయి.

ఒక వేళ తాను కన్జర్వేటివ్ పార్టీ లీడర్షిప్‌ను గెలుచుకోకపోతే వచ్చే ప్రభుత్వానికి మద్దతుదారుగా ఉంటానని ఆదివారం రిషి సునాక్ వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios