రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒక కసాయి అని సంబోధించాడు. అంతేకాదు, పుతిన్‌ను వెంటనే అధికారం నుంచి తొలగించాలని అన్నారు. దీనికి క్రెమ్లిన్ స్పందిస్తూ... పుతిన్‌ను పదవి నుంచి తొలగించే అధికారం అమెరికా అధ్యక్షుడికి లేదని, రష్యా అధ్యక్షుడిని ప్రజలే ఎన్నుకుంటారని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ అన్నారు. 

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగిస్తున్న రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్‌ పై అమెరికా అధ్యక్షులు జో బైడెన్ ఫైర్ అయ్యారు. వ్లాదిమిర్ పుతిన్‌ను ఓ కసాయి అని సంబోధించాడు. అంతేకాదు, వెంటనే ఆయనన్ను అధికారం నుంచి తొలగించాలిన మండిపడ్డారు. కాగా, ఈ వ్యాఖ్యలపై రష్యా కౌంటర్ ఇచ్చింది. రష్యా అధ్యక్షుడిగా పుతిన్‌ను తొలగించాలా? కొనసాగించాలా? అనే విషయంలో అమెరికా అధ్యక్షుడికి అధికారం లేదని క్రెమ్లిన్ రియాక్ట్ అయింది. రష్యా అధ్యక్షుడి ఎన్నిక రష్యా ప్రజల చేతిలో ఉంటుందని పేర్కొంది.

రష్యాపై అమెరికా విమర్శల్లో వాడి పెరిగింది. ఏకంగా పుతిన్‌ను కసాయి అనే స్థాయికి బైడెన్ సాహసించాడు. ఆయన నాలుగు రోజుల పోలాండ్ పర్యటనలో ఉన్నప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఉక్రెయిన్ నుంచి శరణార్థులుగా పొరుగు దేశం పోలాండ్‌కు వలస వచ్చిన వారితో మాట్లాడుతూ పుతిన్‌ పై మండిపడ్డారు.

అదే సందర్భంగా ఆయన పుతిన్‌కు మరో వార్నింగ్ ఇచ్చారు. రష్యా ప్రభుత్వం తన హద్దుల్లో ఉండాలని, నాటో దేశాల వైపు ఒక్క ఇంచు కదిలినా ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. నాటో దేశాల భూభాగాల్లోకి రష్యా వస్తే సహించేది లేదని వివరించారు. ఈ యుద్ధం సుదీర్ఘంగా సాగుతుందని అన్నారు. రోజుల్లో.. నెలల్లో ముగిసేది కాదని, కాబట్టి, స్పష్టమైన ప్రణాళికతో దీర్ఘకాలం పోరాడటానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. రష్యాపై ఉక్రెయిన్ పోరాటాన్ని యాంటీ సోవియట్ పోరాటంగా చిత్రించారు. ప్రపంచ దేశాలు అన్నీ సుదీర్ఘ పోరాటానికి సంసిద్ధమై ఉండాలని వివరించారు. ఉక్రెయిన్‌పై దాడులు రష్యా వ్యూహాత్మక వైఫల్యం అని చెప్పారు. తాము ఉక్రెయిన్‌కు అండగా నిలుచుంటామని హామీ ఇచ్చారు.

కాగా, పుతిన్ నుంచి పదవి నుంచి తొలగించడం అమెరికా చేతిలో ఉండదని క్రెమ్లిన్ స్పందించింది. అది బైడెన్ అధికారంలో లేని అంశం అని స్పష్టం చేసింది. రష్యా ప్రజల చేతిలో ఆ అధికారం ఉంటుందని వివరించింది. కాగా, దీనిపై వైట్ హౌజ్ మరోసారి స్పందించింది. తాము రష్యాలో ప్రభుత్వాన్ని మార్చాలని అనలేదని, దాని పొరుగు దేశాల్లో రష్యా అధికారాన్ని చూపెట్టవద్దని పేర్కొన్నట్టు వివరించింది.

ఇదిలా ఉండగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ మరోసారి నాటో దేశమైన పోలాండ్‌ను ఆయుధ సహకారం కోరారు. ఫైటర్ జెట్లు, ట్యాంక్‌లు తమకు అందించాలని అన్నారు. లేదంటే.. రష్యా తమపై దాడితో ఊరుకోబోదని, అది నాటో దేశాలకు ముప్పుగా తయారు అవుతుందని తెలిపారు. నాటో దేశాలపై మిస్సైల్ దాడులే కాదు.. ఏకంగా నేరుగా మిలిటరీ ఫైట్‌కూ దిగే ముప్పు తప్పదని హెచ్చరించారు.