రోడ్డు మీద పది రూపాయల నోటు కనిపిస్తే ఎవరూ చూడకుండా జేబులో వేసుకుంటాం. అలాంటిది రూ.75 లక్షలు దొరికితే ఏం చేస్తారు.. ఖచ్చితంగా ఇంటికి తీసుకెళ్లి పండగ చేసుకుంటారు. కానీ ఓ కుటుంబం మాత్రం నిజాయితీగా పోలీసులకు సమాచారం అందించింది.

వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని వర్జీనియాకు చెందిన డేవిడ్ ఫ్యామిలీ గత శనివారం సరదాగా బయటికి వెళ్దామని పిక్‌అప్ ట్రక్‌లో బయల్దేరింది. కరోలైన్ కౌంటీ నుంచి కొంతదూరం ప్రయాణించిన తర్వాత గూడ్‌లాండ్ కౌంటీ వద్ద రోడ్డుపై వీరికి ఓ బ్యాగ్ కనిపించింది.

Also Read:రొట్టె కొనుక్కోడానికి రోడ్డుదాటుతుండగా తెలంగాణ వ్యక్తికి 2 లక్షల ఫైన్!

అందులో చెత్త ఏమైనా ఉందేమోనని భావించిన వారు వాహనాన్ని నిలిపి ఆ బ్యాగును వెనకాల పడేశారు. అలా కొంతదూరం వెళ్లిన తర్వాత మరో బ్యాగ్ కనిపించింది. దీనిని కూడా వెనకాల పడేశారు.

అటు ఇటు తిరిగి సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు. ఈ సమయంలో వారి దృష్టి బ్యాగులపై పడింది. వీటిలో ఏముందా అని తెరిచి చూడగా డబ్బులు కనిపించాయి. వేరొకరు అయితే వాటిని దాసుకుని ఏం తెలియనట్లు వ్యవహరించేవారే. కానీ డేవిడ్ కుటుంబం ఆ డబ్బు గురించి పోలీసులకు సమాచారం అందించింది.

Also Read:బెంగళూరులో భారీ పేలుడులాంటి శబ్దం, భయాందోళనలకు లోనైన ప్రజలు!

వారి ఇంటికి చేరుకున్న పోలీసులు ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు బ్యాగుల్లో దాదాపు 1 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.75 లక్షలు) ఉన్నట్లు గుర్తించారు.

స్వార్ధం కోసం ఆలోచించకుండా నిజాయితీగా వ్యవహరించిన డేవిడ్ కుటుంబసభ్యులను పోలీసులు ప్రశంసించారు. వీరికి నగదు బహుమతిని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే అంత డబ్బున్న సంచులు ఆ రోడ్డు మీద ఎవరు వేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.