కరోనా వైరస్ మహమ్మరి దెబ్బకు విధించిన లాక్ డౌన్ వల్ల ప్రజలు ఎక్కడెక్కడో చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. మన దేశానికి చెందిన వారు విదేశాల్లో చిక్కుకొని తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నామని తెలుపుతూ...వారి గోసను వెళ్లగక్కుతూ వీడియోలు పెడుతున్న హృదయ విదారకమైన వైనం మనం చూస్తూనే ఉన్నాం. 

తాజాగా తెలంగాణకు చెందిన ఒక వ్యక్తి రొట్టె కొనుక్కుందామని రోడ్డు దాటుతుండగా అతడిని పట్టుకొని లాక్ డౌన్ నియమాలను ఉల్లఘించాడని అతడిమీద 10 వేల రియాల్ ల ఫైన్ వేసింది సౌదీ ప్రభుత్వం. మన రూపాయల్లో చెప్పాలంటే... అక్షరాలా రెండు లక్షల రూపాయలు. 

పూర్తి వివరాల్లోకి వెళితే.... అమరగొండ శ్రీనివాస్ అనే వ్యక్తి మంచిర్యాల జిల్లా నుంచి ఎన్నో ఆశలతో సౌదీలో 7 నెలల కింద కాలు పెట్టాడు. అప్పటి నుండి అతడు అక్కడ ఉద్యోగం కోసం వెదుకుతున్నప్పటికీ..... ఉద్యోగం మాత్రం దొరకలేదు. 

ఇలా కాలం వెళ్లదీస్తుండగానే... లాక్ డౌన్ విధించారు. అక్కడ గల్ఫ్ లో ఉన్న తెలుగు వారి ప్రతినిధి మాట్లాడుతూ... రొట్టె కొనుక్కోవడానికి అతడు రోడ్డు దాటుతుండగా పోలీసులు అతడిని ఆపి లాక్ డౌన్ ను ఉల్లంఘించినందుకు ఫైన్ విధించినట్టు తెలిపారు. 

తాను పేదవాడినని, భారతదేశంలోనే ఎటువంటి ఆదాయం లేక బ్రతకడానికి ఇన్ని వేల కిలోమీటర్ల దూరం వచ్చానని, ఇప్పుడు తాను ఫైన్ కట్టేంతవరకు సౌదీ అరేబియా ను వీడలేనని అధికారులు చెబుతున్నారని, అంత డబ్బు తన దగ్గర లేదని వాపోతున్నాడు. 

తనను ఆదుకోవాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను వేడుకుంటున్నానని, ఎలాగైనా ఆ దేశం నుంచి తనను బయటపడేయవలిసిందిగా కోరాడు శ్రీనివాస్.