అమెరికాలో ప్రియురాలిని బంధించిన ఓ ప్రియుడిని విచిత్రమైన రీతిలో పోలీసులు అరెస్ట్ చేశారు. పిజ్జా ఆర్డరింగ్ యాప్ లో తనను రక్షించాలంటూ ఆమె చేసిన మెసేజ్ తో ఇది సాధ్యం అయ్యింది.
అమెరికా : అమెరికాలో ఓ మహిళ తనను బంధించిన వ్యక్తి నుంచి పిజ్జా ఆర్డర్ యాప్ ఉపయోగించి తప్పించుకున్న ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఫ్లోరిడాకు చెందిన చెరిల్ ట్రెడ్ వే.. అనే మహిళను ఆమె ప్రియుడు గత కొంతకాలంగా బంధించి ఉంచాడు. దీంతో ఎలా తప్పించుకోవాలో తెలియని ఆమె చివరికి ఒక ప్లాన్ వేసింది. అతడిని తనకు పిజ్జా ఆర్డర్ చేయమని రిక్వెస్ట్ చేసింది.
చివరికి ఎలాగైతేనేం అతనిని ఒప్పించి ఫోన్ తీసుకుంది.. ఆ తర్వాత పిజ్జా ఆర్డర్ చేస్తూ… స్పెషల్ రిక్వెస్ట్ అని ఉన్నచోట.. ‘దయచేసి నాకు సహాయం చేయండి.. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పండి.. 911కు కాల్ చేయండి’ అని రాసింది. ఈ ఆర్డర్ తీసుకున్న వారు వెంటనే ప్రమాదాన్ని ఊహించి పోలీసులకు సమాచారం అందించారు.
డబ్ల్యూడబ్బ్ల్యూఈ మాజీ ఛాంపియన్ బ్రే వ్యాట్ గుండెపోటుతో మృతి..
ఆ సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెని విడిపించారు. పెప్పరోని, స్మాల్ క్లాసిక్ పిజ్జా ఆర్డర్ చేసిన ఆమె పిజ్జా హట్ సిబ్బందికి తనకు సహాయం కావాలంటూ, పోలీసులకు సమాచారం ఇవ్వమంటూ మెసేజ్ చేసింది. దీంతో హైలాండ్స్ కౌంటిలోని వారి ఇంటికి పోలీసులు వెళ్లారు.
పోలీసులను చూసిన ఆమె వెంటనే చిన్న పిల్లాడిని ఎత్తుకుని బయటికి పరిగెత్తుకొచ్చింది. 26 ఏళ్ల ఈతాన్ ఎర్ల్ నికెర్సన్ ఆ మహిళ బాయ్ ఫ్రెండ్. అతనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో సోదాలు చేసిన పోలీసులకు ఆమెతోపాటు మరో ఇద్దరు పిల్లలు కూడా క్షేమంగా ఉన్నారని నిర్ధారించుకున్నారు.
అయితే పిజ్జా ఆర్డర్ తీసుకున్న రెస్టారెంట్ యజమాని మాత్రం తాము ఇంతకుముందు ఇలాంటి ఉదంతం ఎప్పుడూ చూడలేదని తెలిపాడు. ఆ పిజ్జా సంస్థలో తాను 28 ఏళ్లుగా పనిచేస్తున్నానని.. ఎప్పుడూ ఇంత విచిత్రమైన ఘటన తాను చూడలేదన్నారు. పోలీసులు ఆ మహిళ బాయ్ ఫ్రెండ్ పై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు.
2017లో జరిగిన ఈ ఉదంతాన్ని తాజాగా ఓ యూజర్ ట్విట్టర్ లో షేర్ చేశారు. దీంతో ఇది వైరల్ గా మారింది, దీని మీద నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. పిజ్జా యాప్ తో ఇలాంటి ప్రమాదాలనుంచి కూడా తప్పించుకోవచ్చా? అని కొందరు అంటుండగా.. ఇంతకీ ఈ పిజ్జా బిల్లు ఎవరు చెల్లిస్తారు అంటూ మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవాలని ఒకరు అంటే, పోలీసులే ఆ పిజ్జాను డెలివరీ చేస్తే బాగుండేది కదా అని ఇంకొందరు… ‘డెలివరీ బాయ్ కి టిప్ ఇచ్చారా?, ఆమె రక్షించబడింది సరే ఆమెకు పిజ్జా ఆర్డర్ వెళ్లిందా?, పెపరోని పిజ్జా నా ఫేవరెట్…’ ఇలా అనేక రకాలుగా నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.
