రోడ్డుపైనే విమానం కూలిపోయిన సంఘటన దక్షిణ కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. పైలెట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణ సమయంలోనే కాండర్‌ స్క్వాడ్రన్‌ ఆఫీసర్స్‌, ఎయిర్‌మెన్స్‌ అసోసియేషన్‌కు చెందిన నార్త్‌ అమెరికన్‌ ఎస్‌ఎన్‌జే-5 విమాన ఇంజిన్‌ ఫెయిల్‌ అయింది. పైలట్‌ రాబ్‌ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని ఎవరూలేని ఓ రోడ్డుపై ల్యాండ్‌ చేశారు. అయితే అగోరా హిల్స్‌లోని 101 ఫ్రీవేపై ల్యాండింగ్‌ చేస్తుండగా విమాన రెక్క డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో విమానంలో మంటలు చెలరేగాయి.

లాస్‌ ఏంజిల్స్‌ కౌంటీ ఫైర్‌ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పైలట్‌ను విమానంలో నుంచి బయటకు తీశారు. తర్వాత కొద్దిసేపటికే విమానం మంటలకు ఆహుతైంది. ఈ ప్రమాదంతో కిలోమీటర్లమేర భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ప్రమాద సమయంలో విమానంలో పైలట్‌ మినహా ఎవరూ లేరు. అదే సమయంలో రోడ్డుపై కూడా వాహనాలు లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. విమాన ఇంజిన్‌ ఫెయిలవ్వడంతో రద్దీగా లేని ఫ్రీవేపై ల్యాండ్‌ చేయాలనుకున్నానని రాబ్‌ తెలిపారు. ఎవరికీ గాయాలవ్వకుండా విమానాన్ని ల్యాండ్‌ చేయగలిగానన్నారు.