విజయ్ మాల్యాకి బ్రిటన్ కోర్టు షాక్..

First Published 16, Jun 2018, 12:29 PM IST
Vijay Mallya Asked To Pay 200,000 Pounds To Indian Banks By UK Court
Highlights

దిమ్మతిరిగిపోయే షాకిచ్చిన కోర్టు

ప్రభుత్వ బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకి బ్రిటన్ న్యాయస్థానం షాక్ ఇచ్చింది.  మాల్యా నుంచి ఎగ్గొట్టిన రుణాన్ని వసూలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అంతేకాకుండా మాల్యాని భారత్ కి పంపించాల్సిందిగా కూడా భారత ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే. 

కాగా.. తాజాగా.. మాల్యా కేసులో బ్రిటన్ న్యాయస్థానం అనూహ్య తీర్పును వెల్లడించింది. తమ రుణాలను  రాబట్టేందుకు  బ్యాంకులు చేస్తున్న చట్టబద్దమైన పోరాట వ్యయాలకింద 13 భారతీయ బ్యాంకులకు  కనీసం 2 లక్షల పౌండ్లు (రూ.1.80 కోట్లు) చెల్లించాలని  ఆదేశించింది. 

ఈ మేరకు  న్యాయమూర్తి ఆండ్రూ హెన్షా ఆదేశించారు.  మరోవైపు మాల్యా ఆస్తులను జప్తు చేసేందుకు సంబంధించిన ఆర్డర్‌ను  ఆయన తిరస్కరించారు. అయితే, బ్యాంకులకు అవుతున్న ఖర్చును మాత్రం తప్పకుండా చెల్లించాల్సిందేనని ఆదేశించారు. 

మాల్యాను భారత్‌కు తిరిగి రప్పించేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ మేరకు మాల్యాను  పంపాల్సిందిగా కోరుతూ భారత్ వేసిన పిటిషన్‌పై వచ్చే నెల వెస్ట్‌మినిస్టర్‌ కోర్టులో తుది వాదనలు జరగనున్నాయి.  కాగా స్టేట్‌ బ్యాంకు సహా దేశంలోని 13 బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.9 వేల కోట్లకుపైగా రుణాలను ఎగ్గొట్టిన పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా 2016లో లండన్ పారిపోయిన సంగతి తెలిసిందే.

loader