లాస్ ఏంజిల్స్ లో ఓ వ్యక్తి 60 సరీసృపాలను తన ప్యాంటులో సరిహద్దు దాటిస్తూ పట్టుబడ్డాడు. అతని వద్ద రకరకాల పాములు, బల్లులు, తాబేళ్లు దొరికాయి. అయితే అవన్నిటినీ అతను తన దుస్తుల్లో దాయడం గమనార్హం.
లాస్ ఏంజిల్స్ : సరీసృపాల స్మగ్లింగ్ ఎంటర్‌ప్రైజ్‌లో భాగంగా పాములు, బల్లులను ప్యాంటులో దాచిపెట్టి తరలిస్తున్న వ్యక్తిని అమెరికాలో అరెస్ట్ చేశారు. వీటి విలువ 750,000 డాలర్లుగా తేల్చారు. వీటిని యునైటెడ్ స్టేట్స్‌లోకి అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గత ఆరేళ్లుగా అతను ఈ పని చేస్తున్నాడని తేలింది. దక్షిణ కాలిఫోర్నియాకు చెందిన జోస్ మాన్యుయెల్ పెరెజ్ దీనికి సూత్రధారి. అతను తన ఇంటినుంచే ఈ కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. అతని ఇప్పటివరకు మెక్సికో, హాంకాంగ్ నుండి యునైటెడ్ స్టేట్స్‌లోకి 1,700 జంతువులను తరలించినట్టు విచారణలో తేలింది.
ఈ నేరానికి గానూ ఇతనికి దశాబ్దాలపాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు బుధవారం తెలిపారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ విచారణలో తన కార్యకలాపాలగురించి చెబుతూ పెరెజ్ తన అక్రమ సరుకులో కొంత భాగాన్ని రవాణా చేయడానికి మ్యూల్స్ కూడా చెల్లించినట్లు తెలిపాడు. మరికొన్నిసార్లు స్వయంగా సరిహద్దు దాటించినట్లు అంగీకరించాడు.
అతను ఇప్పటివరకు స్మగుల్ చేసిన వాటిల్లో యుకాటాన్ బాక్స్ తాబేళ్లు, మెక్సికన్ బాక్స్ తాబేళ్లు, పిల్ల మొసళ్లు, మెక్సికన్ పూసల బల్లులతో అనేక రకాల సరీసృపాలు ఉన్నాయి. అతను ఇలా రవాణా చేసిన జంతువులను దేశవ్యాప్తంగా ఉన్న ఖాతాదారులకు739,000 డాలర్ల కంటే ఎక్కువ ధరకు విక్రయించినట్లు అతని వద్ద లభించిన పత్రాలు చూపిస్తున్నాయి.
ఈ మార్చిలో అతను మెక్సికో నుండి వీటి అక్రమరవాణా చేస్తూ పట్టుబడ్డాడు. అతను ఆ సమయంలో తన నడుం చుట్టూ.. దుస్తుల్లో.. ప్యాంటు లోపల.. జేబుల్లో.. లో దుస్తుల్లో.. ఇతర భాగాల్లో మొత్తం 60 రకాల ప్రాణుల్ని తరలించే ప్రయత్నం చేశాడు. పోలీసులకు అనుమానం వచ్చి చెక్ చేయడం అతడి దగ్గర సరీసృపాలు ఉన్నట్టుగా తేలింది. అయితే, అవి తన పెంపుడు బల్లులంటూ అతను బుకాయించాడు. కానీ అధికారులు అతడిని క్షుణ్ణంగా పరిశీలించి.. షాక్ అయ్యారు. అతని దగ్గర 60 సరీసృపాలు ఉన్నట్లు కనుగొన్నారు.
వాటిలో ఆర్బోరియల్ ఎలిగేటర్ బల్లులు, ఇస్త్మియన్ డ్వార్ఫ్ బోయాస్ లు కూడా ఉన్నాయి. డ్వార్ఫ్ బోయాస్ రంగును మార్చే ఒక రకమైన పాము. ఇది ప్రమాదకరపరిస్థితుల్లో తన రక్షణ కోసం కళ్ళ నుండి రక్తస్రావాన్ని చేయగలదు. వీటిల్లో మూడు సరీసృపాలు చనిపోయాయి.
పోలీసుల విచారణలో రెండు స్మగ్లింగ్‌లలో తన నేరాన్ని పెరెజ్ అంగీకరించాడు. వీటికి గానూ ఒక్కో స్మగ్లింగ్ కు 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. దీంతోపాటు వన్యప్రాణుల అక్రమ రవాణాకు సంబంధించి ఒక్కోదానికి గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్ష విధించబడుతుంది. అయితే ఇతనికి డిసెంబర్ 1న శిక్ష విధించబడుతుంది.
