Asianet News TeluguAsianet News Telugu

Fact-Check: రెండో పెళ్లి చేసుకోకుంటే జైలుకే.. అందుకు భార్య ఒప్పుకోవాల్సిందే!.. ఈ వైరల్ వార్తలో నిజమెంత?

ఆఫ్రికా దేశం ఎరిత్రియాలో పురుషుల జనాభా క్షీణించి.. మహిళల జనాభా విపరీతంగా పెరిగిందని, దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ఒక పురుషుడు కనీసం రెండు పెళ్లిళ్లు చేసుకోవాలని, లేదంటే అతడికి జీవిత ఖైదు పడుతుందని ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. కానీ, ఇది అసత్యమైన కథనం అని తేలింది.

fact check.. eritrea man has to atleat marry two women a claim proved false
Author
First Published Aug 24, 2022, 2:22 PM IST

న్యూఢిల్లీ: సోషల్ మీడియా యుగం ఇదీ.. నేడు ప్రజలు సోషల్ మీడియా నుంచే వార్తలైనా.. విషయాలైనా ఎక్కువగా తెలుసుకుంటున్నారు. దీని ద్వారా ప్రధాన స్రవంతి మీడియా ప్రచురించని విషయాలు తెలుసుకునే వెసులుబాటు ఎంత ఉన్నదో అంతకు మించి అవాస్తవ కథనాల సర్క్యులేషన్ కూడా ఉన్నది. సోషల్ మీడియాను పకడ్బందీగా కంట్రోల్ చేయగలిగితే యూజర్ల అభిప్రాయాలను మార్చగలిగే లేదా తయారు చేసే శక్తిని పొందుతారనేది మరో ఆందోళనకర విషయం. దీనికితోడు.. ఒక ఘటన లేదా విషయం నిజమైనదా? లేక అబద్ధమా? అనేది నిర్దారించకముందే అది కొన్ని వేలు లేదా లక్షల మంది కంటికి చేరుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతున్నది. ఎరిత్రియా అనే ఆఫ్రికా దేశంలో వింత ఆచారం (చట్టం కూడా) అమల్లో ఉన్నదని, ఒక్కడ ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకోవాల్సి ఉంటుందనేది ఆ వార్త సారాంశం. రెండో పెళ్లి చేసుకోని అబ్బాయికి జీవిత ఖైదు పడుతుందని, లేదా రెండో పెళ్లికి అంగీకరించి మొదటి భార్యకూ శిక్ష ఉంటుందని ఆ వార్త చెబుతున్నది. కానీ, అందులో నిజం లేదని తెలుస్తున్నది.

ఆఫ్రికా ఖండం ఈశాన్యం వైపు ఇథియోపియా దగ్గర ఎర్రసముద్రం పరివాహకంలో ఎరిత్రియా దేశం ఉన్నది. దీనికి పొరుగు దేశం ఇథియోపియాతో తరుచూ యుద్ధాలు జరుగుతుంటాయి. ఈ యుద్ధాల్లో చిన్న దేశమైన ఎరిత్రియా సైనికులు పెద్ద ఎత్తున మరణించారని, తత్కారణంగా ఆ దేశంలో పురుషుల జనాభా తగ్గిపోగా మహిళల జనాభా విస్ఫోటనం గావించిందని కెన్యాకు చెందిన ఓ సెటైరికల్ సైట్ క్రేజీ మండే కొన్ని సంవత్సరాల (2016!) క్రితం రాసింది. ఈ అసమతుల్యానికి చెక్ పెట్టడానికి ఎరిత్రియా దేశం ఒక అసాంఘిక చట్టం తెచ్చిందని ఆ కథనం పేర్కొంది.

పురుషుల జనాభా కుచించుకుపోవడం మూలంగా మహిళలు దీర్ఘకాలం పెళ్లి చేసుకోకుండా మిగిలిపోవాల్సి వస్తున్నదని, కాబట్టి, అందరికీ పెళ్లిళ్లు జరగడానికి ఆ దేశంలోని ప్రతి పురుషుడు కనీసం ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకోవాలని ప్రభుత్వం చట్టం తెచ్చినట్టు ఆ సెటైరికల్ వెబ్ సైట్ రాసుకొచ్చింది. రెండో పెళ్లి చేసుకోకుంటే సదరు అబ్బాయికి జీవిత ఖైదు పడుతుందని, రెండో పెళ్లిని అంగీకరించిన మహిళకూ శిక్ష ఉంటుందని పేర్కొంది.

గతంలోనే హల్ చల్ చేసిన ఈ వార్త సోషల్ మీడియా పుణ్యమా అని మరోసారి వైరల్ అవుతున్నది. ఈ వార్త పూర్తిగా అసత్యం అని ఆ దేశ అధికారులే స్పష్టం చేసినా మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నది.

ఈ కథనం అబద్ధం అని ఎరిత్రియాలోని పిచ్చి మనిషి కూడా చెబుతాడని ఓ ఎరిత్రియా అధికారి గతంలో బీబీసీకి తెలిపారు. 2016లో ఈ అవాస్తవ కథనంపై ఎరిత్రియా ప్రభుత్వం స్పందించింది. అప్పటి ఇన్ఫర్మేషన్ మంత్రి యెమన్ జీ మెస్కెల్ తన ట్విట్టర్ అకౌంట్‌తో ఇది పూర్తిగా అవాస్తవం.. మీడియా తప్పిద కథనం అని పేర్కొన్నారు. 

ఎరిత్రియా శిక్షాస్మృతి ప్రకారం కూడా బహుభార్యత్వం నిషేధం. ఇదొక్కటి చాలు ఆ కథనం అవాస్తవం అని చెప్పడానికి. ఎరిత్రియా పురుషుడు కచ్చితంగా కనీసం రెండు పెళ్లి చేసుకోవాల్సిందే అని చెబుతున్న కథనాలు అవాస్తవాలు అని స్పష్టం అవుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios