యూకేలో ఇటీవల అరుదైన మంకీ పాక్స్ వ్యాధి కేసులు వెలుగుచూడగా.. ఇప్పుడు అమెరికాలో కూడా మంకీ పాక్స్ వ్యాధి కేసు నమోదైంది. ఇటీవలే కెనడాకు వెళ్లివచ్చిన అమెరికాలోని మసాచుసెట్స్‌కు చెందిన వ్యక్తి మంకీ పాక్స్ బారిన పడినట్టుగా అధికారులు గుర్తించారు.
యూకేలో ఇటీవల అరుదైన మంకీ పాక్స్ వ్యాధి కేసులు వెలుగుచూడగా.. ఇప్పుడు అమెరికాలో కూడా మంకీ పాక్స్ వ్యాధి కేసు నమోదైంది. ఇటీవలే కెనడాకు వెళ్లిన అమెరికాలోని మసాచుసెట్స్‌కు చెందిన వ్యక్తి మంకీ పాక్స్ బారిన పడినట్టుగా అధికారులు గుర్తించారు. ఈ మేరకు మసాచుసెట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ ప్రకటించింది. ఈ ఏడాది అమెరికాలో నమోదైన తొలి మంకీ పాక్స్ కేసు ఇదేనని అక్కడి అధికారులు ధ్రువీకరించారు. మంకీ పాక్స్ బారిన పడిన వ్యక్తి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి బాగానే ఉన్నట్టుగా సమాచారం. అయితే మంకీ పాక్స్ కేసు నిర్దారణ కావడంతో యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అప్రమత్తమైంది. మరోవైపు కెనడాలోని క్యూబెక్ ప్రావిన్స్‌లోని ఆరోగ్య అధికారులు 10కి పైగా అనుమానాస్పద మంకీపాక్స్ కేసులను గుర్తించి పరిశీలనలో ఉంచారు.
ఇక, మసాచుసెట్స్ వ్యక్తి స్నేహితులను కలవడానికి ఈ ఏడాది ఏప్రిల్ చివరిలో కెనడాకు వెళ్లాడు. మే నెల ప్రారంభంలో తిరిగి వచ్చాడు. కెనడా వెళ్లేందుకు అతను ప్రైవేట్ రవాణాను ఉపయోగించాడు. అమెరికాలో ఈ ఏడాది మంకీ పాక్స్ మొదటి కేసు ఇది. గత సంవత్సరం.. టెక్సాస్, మేరీల్యాండ్ ఒక్కొక్కటి చొప్పున మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి. నైజీరియాకు ప్రయాణించిన వ్యక్తులలో ఈ కేసులో నివేదించబడ్డాయి.
ఇక, మే 6 నుంచి ఇప్పటివరకు యూకేలో మొత్తం 9 మంకీ పాక్స్ కేసులు వెలుగుచూశాయి. ఈ మేరకు యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ బుధవారం తెలిపింది. మరోవైపు స్పెయిన్, పోర్చుగల్ కూడా 40 కంటే ఎక్కువ మంకీపాక్స్ అనుమానిత కేసులను గుర్తించినట్లు బుధవారం ప్రకటించాయి. ఇదిలా ఉంటే.. మంకీ పాక్స్ మనిషి నుంచి మనిషికి అంత త్వరగా వ్యాప్తిచెందదని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ ఎమర్జింగ్ ఇన్‌ఫెక్షన్స్ డైరెక్టర్ డాక్టర్ కొలిన్ బ్రౌన్ అన్నారు. సాధారణ ప్రజానీకానికి దీని వల్ల ముప్పు తక్కువ అని చెప్పారు.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మంకీపాక్స్ వైరస్ చికెన్ పాక్స్ వైరస్ కుటుంబానికి చెందినది. మంకీపాక్స్ సాధారణంగా ఫ్లూ లాంటి అనారోగ్యం, శోషరస కణుపుల వాపుతో ప్రారంభమవుతుంది. WHO ప్రకారం.. మంకీ పాక్స్ లక్షణాలు 6 నుంచి 13 రోజులలో కనిపించడం ప్రారంభిస్తాయి. దీని బారిన పడ్డవారు జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వెన్ను, కండరాల నొప్పితో కూడిన తీవ్రమైన బలహీనతకు గురవుతారు. ఆ తర్వాత ముఖం, శరీరంపై దద్దుర్లు వస్తాయి. దీనికి ఖచ్చితమైన చికిత్స అందుబాటులో లేదు... కానీ మశూచి వ్యాక్సిన్ మంకీపాక్స్‌కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. ఇది సాధారణంగా ప్రజలలో సులభంగా వ్యాపించదు.
