వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా తాను రెండోసారి ఎన్నికవకుండా భారీ కుట్ర జరిగిందని మరోసారి డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ లీగల్ ఓట్లు మాత్రమే లెక్కిస్తే విజయం తమదేనని అన్నారు. డెమోక్రాటిక్ పార్టీ మెయిల్ ఇన్ బ్యాలెట్ పద్దతిలో అవకతవకలకు పాల్పడిందని ట్రంప్ విమర్శించారు. 

ఓవైపు ఎన్నికల ఫలితాలు ఇంకా వెలువడుతున్న సమయంలోనే ట్రంప్ పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు ఆరోపిస్తున్నారు. దేశంలోని మీడియా సంస్థలు, ఎన్నికల అధికారులు, డెమోక్రాట్ పార్టీ కుమ్మకయి తన ఓటమికి కుట్ర పన్నారని ట్రంప్ ఆరోపించారు. పెద్ద పెద్ద సాంకేతిక, మీడియా సంస్థలు జోక్యం చేసుకున్నప్పటికీ నిర్ణయాత్మక రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ విజయం సాధించిందన్నారు. 

దేశవ్యాప్తంగా డెమోక్రాట్ల హవా సాగుతుందని మీడియాలో ప్రచారం జరుగుతోందని... కానీ దేశవ్యాప్తంగా వీస్తున్నది రిపబ్లికన్ల గాలేనని ట్రంప్ అన్నారు. కొన్ని చోట్ల రిపబ్లికన్ల ఎన్నికల పరిశీలకులు లేకుండానే కౌంటింగ్‌ జరుపుతున్నారని... ఎన్నికల అధికారులు డెమోక్రాట్లతో కుమ్మక్కయ్యారని అనడానికి ఇదే నిదర్శనమన్నారు.  అసలు కౌంటింగ్‌ కేంద్రాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు కూడా రిపబ్లికన్లను అనుమతించడం లేదంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోండి అని ట్రంప్ అన్నారు. 

మరోవైపు కౌంటింగ్ ను నిలిపివేయాలంటూ కోర్టును ఆశ్రయించిన ట్రంప్ కు చుక్కెదురయ్యింది. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ వివిధ రాష్ట్రాల్లోని కోర్టులో ట్రంప్ అనుచరులు వేసిన పిటిషన్ లను కోర్టు కొట్టివేసింది. 

గడువు ముగిసిన తర్వాత వచ్చిన మెయిల్‌ ఇన్‌ ఓట్లను లెక్కించవద్దని, కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ట్రంప్‌ మద్దతుదారులు కోర్టులో జార్జియా, విస్కాన్సిన్‌, పెన్సిల్వేనియా, మిషిగాన్‌ రాష్ట్రాల్లో ఓట్ల కౌంటింగ్‌ను సవాల్‌ చేశారు. ఈ  క్రమంలో సరైన సాక్ష్యాధారాలు లేవంటూ జార్జియా, మిచిగాన్‌ కోర్టులు ఈ పిటిషన్‌లని పరిగణలోకి తీసుకోలేదు.