పాకిస్థాన్ ప్రధాని ఇమ్రన్ ఖాన్ ప్రతిపక్షాలపై, అమెరికా దౌత్యవేత్త డొనాల్డ్ లూపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అమెరికాతో కలిసి ప్రతిపక్షాలు కుట్రపన్నాయని ఆరోపించారు. ఇది దేశద్రోహం అని విమర్శించారు. 

అవిశ్వాస తీర్మానం ద్వారా తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అమెరికా సీనియర్ దౌత్యవేత్త డొనాల్డ్ లూ ‘విదేశీ కుట్ర’లో పాలుపంచుకున్నారని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించిన తర్వాత పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ నేతల సమావేశంలో ఆయ‌న ఆదివారం మాట్లాడారు. అయితే ఈ ఆరోప‌ణ‌ను అమెరికా అధికారులు తోసిపుచ్చారు. 

పాకిస్తాన్‌లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం మధ్య ఇమ్రాన్ ఖాన్ చేసిన స్వతంత్ర విదేశాంగ విధాన ఎంపికల వ‌ల్ల ఒక విదేశం త‌న‌ను తొలగించేందుకు ప్రయత్నించింద‌ని ఆరోపించారు. అవిశ్వాసం తీర్మాణ ఓటింగ్‌లో ప్రధాని బయటపడితే చిక్కులు తప్పవని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్‌లో దక్షిణాసియాకు చెందిన అగ్ర అమెరికా అధికారి లూ, అమెరికాలోని పాకిస్థాన్ రాయబారి అసద్ మజీద్‌ను హెచ్చరించారని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. అమెరికాలోని పాకిస్థాన్ రాయబారి, అమెరికా అధికారుల మధ్య జరిగిన సమావేశానికి సంబంధించిన మినిట్స్‌ను ఎన్‌ఎస్‌సీ సమావేశంలో పంచుకున్నట్లు ఆయన చెప్పారు.

అవిశ్వాస తీర్మానానికి ముందు ఇమ్రాన్ ఖాన్.. రష్యా, చైనాకు వ్యతిరేకంగా ప్రపంచ సమస్యలపై పశ్చిమ దేశాల పక్షం వహించనందున తనను తొలగించడానికి ప్రతిపక్షాలు ‘విదేశీ శక్తుల’తో కుట్ర పన్నాయని ఆరోపించారు. గత గురువారం అతను పాకిస్తాన్ వ్యవహారాల్లో యునైటెడ్ స్టేట్స్ జోక్యం చేసుకుంటోందని ఆరోపించాడు, కాగా స్థానిక మీడియా నివేదికలో వ‌చ్చిన నివేదిక‌ల ప్ర‌కారం.. వాషింగ్టన్‌లోని ఇస్లామాబాద్ రాయబారి నుండి తనకు బ్రీఫింగ్ లెటర్ అందిందని, ఖాన్ పదవిని విడిచిపెడితే సంబంధాలు మెరుగ్గా ఉంటాయని భావిస్తున్నట్లు ఒక సీనియర్ యూఎస్ అధికారి అన్నారని అందులో ఉంది. 

అయితే గ‌త వారం వాషింగ్టన్‌లో స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి నెడ్ ప్రైస్ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ఆరోపణలు వాస్త‌వం కాద‌ని అన్నారు. కాగా ఆదివారం మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్.. ఇది పాలన మార్పులో మార్పు అని అన్నారు. ప్రతిపక్షం దేశానికి ద్రోహం చేసిందని ఆరోపించారు. ఈ ద్రోహం యావత్ దేశం ముందు జరుగుతోందని.. దేశద్రోహులు కూర్చొని ఈ కుట్ర పన్నుతున్నారని ఆయన అన్నారు. ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్య‌ల‌ను ప్ర‌తిప‌క్ష నాయ‌కులు కొట్టిపారేశారు.