అధికారులు ఓ పిల్లిపై ఫైన్ వేశారు. తరుచూ ఇతరుల ఇళ్లకు అక్రమంగా వెళ్లుతున్నదని, అక్కడి పెంపుడు జంతువులతో పోట్లాటకు దిగుతున్నదని జరిమానా విధించారు. దీంతో ఆ యజమాని కోర్టును ఆశ్రయించి ప్రభుత్వ సంస్థపై దావా వేశారు. ఈ కేసులో చివరకు యజమానికి రూ. 95 లక్షలు ఇచ్చి వివాదాన్ని ముగించుకోవాలని కోర్టు సెటిల్‌మెంట్ చేసింది.
న్యూఢిల్లీ: పెంపుడు జంతువులు ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలనే రూలేమీ లేదు. జంతువులు అన్నాక చుట్టూ తిరుగుతాయి. మళ్లీ ఇంటికి వస్తాయి. దీనిపై మన దేశంలో పెద్ద పట్టింపేమీ లేదు. కానీ, అమెరికాలో మాత్రం అలా కాదు. ఎవరైనా ఒక పిల్లినో.. కుక్కనో పెంచుకుంటూ అది ఇతరుల అనుమతి లేకుండా వారి ఇంట్లోకి వెళ్లరాదు. వేరే జంతువులతో పోట్లాడరాదు. అందుకే అమెరికాలో ఓ పిల్లి అనుమతి లేకుండా పొరుగు వారిళ్లలోకి వెళ్లుతున్నదని, ఇతర ఇరుగు పొరుగు జంతువులను వేధిస్తున్నదనే ఫిర్యాదు అధికారులకు అందింది. దీంతో వారు ఆ పిల్లి యజమానికి హెచ్చరికలు జారీ చేశారు. ఓ సారి ఆ పిల్లిని కిట్టీ జైలుకు కూడా పంపారు. అయినా పరిస్థితులు మారలేవని భావించిన ఆ అధికారులు ఆ పిల్లి యజమానికి ఫైన్లు వేశారు. దీంతో ఆ పిల్లి యజమాని కోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ సంస్థలపై దావా వేసింది. దీంతో మూడేళ్లపాటు విచారణ సాగింది. చివరకు ఆ పిల్లి ఆరోపణల్లో పేర్కొన్నట్టుగా ఉల్లంఘనలేవీ చేయలేదని కోర్టు నిర్ధారించింది. చివరకు ఆ యజమానికి రూ. 95 లక్షలు అందించే సెటిల్‌మెంట్‌ను కోర్టు చేసింది.
అమెరికాలోని వాషింగ్టన్‌లో అన్నా డేనియలీ అనే మహిళ నివసిస్తున్నది. ఆమె ఒక పిల్లిని పెంచుకుంటున్నది. ఆ పిల్లి పేరు మిస్కా. ఆ మిస్కా పొరుగు ఇళ్లకు వెళ్లి గందరగోళం చేస్తున్నదని, అంతేకాదు, ఇరుగు పొరుగు జంతువులను హరాస్ చేస్తున్నదని అధికారులకు స్థానికులు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఒక సారి ఆ మిస్కాను కిట్టీ జైలుకు బలవంతంగా తీసుకెళ్లారు. అంతేకాదు, తన పిల్లి చేస్తున్న ఉల్లంఘనలకు గాను జరిమానాలు చెల్లించాలని అధికారులు అన్నా డేనియలీకి తరుచూ ఫైన్లు పంపారు. దీంతో ఆమె ఇక ఉపేక్షించి లాభం లేదని భావించింది. ఆమె కోర్టును ఆశ్రయించి అధికారులపై దావా వేశారు. 2019లో ఈ దావా దాఖలైంది. అప్పటి నుంచి కేసు విచారణ జరుగుతూనే ఉన్నది. చివరకు ఆ పిల్లి తప్పులేమీ లేవని కోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాదు, పిల్లి యజామాని అన్నా డేనియలీకి రూ. 95 లక్షల సెటిల్‌మెంట్ చేయాలని ఆదేశించింది. ఇందులో మిస్కా తరుచూ అక్రమంగా ఇతరుల ఇంటిలోకి చొరబడేదని, ఇతరు పెంపుడు జంతువులతో పోట్లాడేదన్న ఆరోపణలకుగాను పరిహారంగా రూ. 23 లక్షలు చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది.
