అమెరికా లో గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి, హెచ్1బి వీసాదారులకు భారీ ఊరట లభించే విషయాన్నీ చెప్పింది అమెరికా సర్కార్. అక్కడ కరోనా వైరస్ కారణంగా అన్ని అధికార కార్యాలయాలు మూతపడ్డందున వివిధ కారణాలకింద నోటీసులందుకున్న గ్రీన్ కార్డు, హెచ్-1బి వీసాదారులందరికి మరో రెండు నెలలపాటు గడువును పొడిగిస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం తెలిపింది. 

అందిన నోటిసుల్లోని చివరి తేదీ తరువాత మరో 60 రోజులపాటు కాలాన్ని పొడిగిస్తున్నట్టు అమెరికా ప్రభుత్వం తెలిపింది. వీసా ఎక్స్టెన్షన్, రిజెక్షన్, ఇతరాత్రాలన్నిటికి ఈ వ్యవధి అమల్లో ఉంటుందని వారు తెలిపారు. 

అమెరికాలో పని చేస్తూ... ఈ కరోనా ఆంక్షల వల్ల ఇబ్బందులు పడుతున్న వారిని రక్షించేందుకే ఈ అదనపు సమయాన్ని కల్పించినట్టు అధికారులు తెలిపారు. కరోనా దెబ్బకు అమెరికాలో చాలా కంపెనీలు తాత్కాలికంగా మూతపడ్డాయి. అందువల్ల చాలామంది గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న హెచ్-1బి వీసాధారులు తమ వేతనాలను కోల్పోయారు. 

ఇలా వేతనాలు పొందకుండా అమెరికాలో 60 రోజులకు మించి ఉండకూడదు. ఈ లోగా వేరే ఉద్యోగాన్ని వెతుక్కోవడమో... లేదా స్వదేశానికి తిరిగిరావడమో చేయాలి. ఇప్పుడు మరో 60 రోజుల పాటు గడువును పొడిగించడంతో... దాదాపుగా 2 లక్షల మంది హెచ్1బి వీసాదారులు, వారి కుటుంబసభ్యులకు ఈ విషయం భారీ ఊరటగా చెప్పవచ్చు. 

ఇకపోతే... మొన్న ఒక పది రోజుల కింద, కరోనావైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇమ్మిగ్రేషన్ ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 

కనిపించని శత్రువు దాడి చేస్తున్న నేపథ్యంలో, గ్రేట్ అమెరికా పౌరుల ఉద్యోగాలను కాపాడే ఉద్దేశంతో, అమెరికాకు తాత్కాలికంగా ఇమిగ్రేషన్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దానివల్ల విదేశీయులు అమెరికాలోకి ప్రవేశించలేరు.