డే కేర్ సెంటర్ లో అగ్నిప్రమాదం జరిగి ఐదుగురు చిన్నారులు చనిపోయిన సంగటన అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికాలో పెన్సిల్వేనియా రాష్ట్రంలోని హ్యారిస్‌ డే కేర్ సెంటర్ లో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో డే కేర్ యజమాని, మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. అక్కడి సిబ్బంది సమయానికి స్పందించడంతో మరో ఏడుగురు పిల్లల్ని కాపాడగలిగారు. 

అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున  ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి సమయంలోనూ ఈ డే కేర్‌ పనిచేస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. మృతులంతా 8నెలల నుంచి ఏడేళ్ల మధ్య వయసుగల వారు కావడం గమనార్హం. మృతి చెందినవారిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పిల్లలు (ఇద్దరు బాలికలు, ఇద్దరు బాలురు) ఉండటం గమనార్హం.

 పిల్లల తల్లిదండ్రులు రాత్రిళ్లు ఉద్యోగ విధులకు వెళ్లడంతో పిల్లలను ఆ సమయంలో డే కేర్ సెంటర్ లో ఉంచినట్లు వారు చెబుతున్నారు. పిల్లల మృతితో ఆ ప్రాంతంలో విషాద చాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.