సారాంశం
క్రెమ్లిన్‌పై డ్రోన్ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఉక్రెయిన్ స్పష్టం చేసింది. క్రెమ్లిన్‌పై దాడి చేయడం ఉక్రెయిన్‌కే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందని మిఖైలో అభిప్రాయపడ్డారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను హత్య చేసేందుకు ఉక్రెయిన్ ప్రయత్నించిందంటూ రష్యా చేసిన ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ స్పందించింది. క్రెమ్లిన్‌పై డ్రోన్ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడి అధికార ప్రతినిధి మిఖైలో పొడోల్యాక్ అన్నారు. తమకు అలాంటి ఉద్దేశం లేదన్నారు. ఉక్రెయిన్ యుద్ధం మరింత తీవ్రతరం కావడానికి రష్యానే ఈ తరహా ఆరోపణలు చేస్తోందని మిఖైలో ఆరోపించారు. ఉక్రెయిన్‌పై పెద్ద ఎత్తున ఉగ్రవాద దాడికి సిద్ధం చేసే ప్రయత్నంగానే దీనిని పరిగణించాలని ఆయన వ్యాఖ్యానించారు. క్రెమ్లిన్‌పై దాడి చేయడం ఉక్రెయిన్‌కే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందని మిఖైలో అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ రక్షణాత్మకంగానే యుద్ధాన్ని చేస్తుందని.. రష్యా భూభాగంపై తాము దాడి చేయబోమని ఆయన స్పష్టం చేశారు.
అంతకుముందు ఉక్రెయిన్‌పై రష్యా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తమ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను హత్య చేసేందుకు ఉక్రెయిన్ కుట్ర పన్నిందని.. మంగళవారం రాత్రి పుతిన్ కార్యాలయంపై రెండు డ్రోన్‌లతో దాడులు చేసిందని రష్యా ఆరోపించింది. తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా కుట్రను భగ్నం చేశామని.. దాడి నుంచి పుతిన్ తృటిలో తప్పించుకున్నారని పేర్కొంది. రష్యా ఆరోపణలు ప్రస్తుతం అంతర్జాతీయ సమాజంలో కలకలం రేపుతున్నాయి.
ALso Read: క్రెమ్లిన్‌పై డ్రోన్ దాడులు.. పుతిన్‌ను చంపాలనే : ఉక్రెయిన్‌పై రష్యా సంచలన ఆరోపణలు
మరోవైపు క్రెమ్లిన్‌పై దాడిని ప్లాన్డ్ టెర్రరిస్ట్ అటాక్‌గా ఆర్ఐఏ నివేదించింది. పుతిన్‌కు ఎలాంటి గాయాలు కాలేదని.. అధ్యక్ష భవనానికి ఎలాంటి నష్టం జరగలేదని క్రెమ్లిన్ వెల్లడించింది. రెండు మావనరహిత విమానాలు క్రెమ్లిన్‌ను లక్ష్యంగా చేసుకున్నాయని.. అయితే రాడార్ వార్ ఫేర్ సిస్టమ్స్‌తో సైన్యం అప్రమత్తంగా వుండటంతో వీటి ప్రయత్నం ఫలించలేదని వెల్లడించింది.
విక్టరీ డేను పురస్కరించుకుని మే 9 పరేడ్ జరగనుందని.. ఈ కార్యక్రమానికి విదేశీ అతిథులు హాజరుకాకుండా ఈ దాడులకు తెరదీసినట్లుగా క్రెమ్లిన్ ఆరోపిస్తోంది. ఎప్పుడు, ఎక్కడ ప్రతీకార చర్యలకు దిగాలో రష్యాకు తెలుసునని పేర్కొంది. అయితే క్రెమ్లిన్‌పై డ్రోన్ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోల్లో అధ్యక్ష భవనంపై పొగ కమ్ముకున్నట్లు కనిపించింది.