బ్రిటన్ లో భారత బిడ్డ పాలన ముగిసింది... రిషి సునక్ ఓటమికి కారకులు వీళ్లే ..!!
భారత సంతతికి చెందిన రిషి సునక్ బ్రిటన్ ప్రధాని పదవిని కోల్పోయారు. ఆయన సారథ్యంలో ఎన్నికలకు వెళ్లిన కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమికి కారణాలేంటంటే..
UK Election Results 2024 : భారతీయులను బానిసలుగా చేసుకుని శతాబ్దాల పాటు పాలించారు బ్రిటీష్ వాళ్లు. అలాంటిది బ్రిటన్ ను ఓ భారతీయుడు పాలిస్తాడని ఎవరూ ఊహించి వుండరు... కానీ దీన్ని నిజం చేసారు రిషి సునక్. ఇంతకాలం ఓ భారతీయ బిడ్డ, అందులోనూ ఓ తెలుగింటి అల్లుడు బ్రిటన్ ప్రధాని అంటూ గర్వంగా చెప్పుకునేవాళ్లం. ఇకపై అలా చెప్పలేం. భారత సంతతి బిడ్డ ప్రధాని ముచ్చట ఎక్కువకాలం నిలవలేదు... తాజాగా జరిగిన బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. దీంతో రుషి సునక్ ప్రధాని పదవి నుండి వైదొలిగారు.
లేబర్ పార్టీ అద్భుత విజయం :
యునైటెడ్ కింగ్డమ్ పరిధిలోని ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్, నార్తర్న్ ఐర్లాండ్ వ్యాప్తంగా 650 పార్లమెంట్ సీట్లు వున్నాయి. ఇందులో సగానికి పైగా అంటే 326 సీట్లు ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్. కానీ తాజా ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించి ఏకంగా 410 స్థానాల్లో లేబర్ పార్టీ విజయం సాధించింది. రుషి సునక్ సారథ్యంలో ఎన్నికలకు వెళ్ళిన కన్జర్వేటివ్ పార్టీ కేవలం 118 సీట్లకే పరిమితం అయ్యింది.
ఇప్పటికే మెజారిటీ సీట్లు సాధించిన లేబర్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఫలితాల అనంతరం ప్రధాని అభ్యర్థి కీర్ స్టార్మర్ బకింగ్ హామ్ ప్యాలెస్ కు వెళ్లి కింగ్ చార్లెస్-3 ని కలిసారు. స్టార్మన్ ను ప్రభుత్వ ఏర్పాటుకు రాజు ఆహ్వానించారు. రాజును కలిసిన అనంతరం స్టార్మర్ బ్రిటన్ ప్రజలను ఉద్దేశించి తొలి ప్రసంగం చేసారు. అంతకుముందే ఓటమిని అంగీకరించిన రిషి సునక్ ప్రధానిగా చివరి ప్రసంగం చేసారు... ఆ తర్వాత కింగ్ చార్లెస్-3 ని కలిసి రాజీనామాను సమర్పించారు.
ప్రధానిగా సునక్ చివరి ప్రసంగం సాగిందిలా :
బ్రిటన్ లో గత 14 ఏళ్లుగా కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో వుంది. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆ దేశంలో ఎప్పుడూ జరిగేలాగే ప్రజలు మరో పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు. ప్రతి 10-15 ఏళ్లకోసారి బ్రిటన్ పాలనా భాద్యతల నుండి పాతవారిని తప్పించి కొత్తవారికి అవకాశం ఇస్తారు అక్కడి ప్రజలు. ఇలా వరుసగా 14 ఏళ్లపాటు పాలించిన కన్జర్వేటివ్ పార్టీని ఓడించి లేబర్ పార్టీకి అధికారం కట్టబెట్టారు.
ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ రిషి సునక్ ప్రధాని పదవికి రాజీనామా చేసారు. అధికారిక నివాసం నుండి చివరి ప్రసంగం చేసిన ఆయన ఎమోషన్ అయ్యారు. ఓటమికి పూర్తి బాధ్యత తనదే... కాబట్టి ప్రధాని పదవి ఇప్పటికే రాజీనామా చేసానని... త్వరలోనే పార్టీ పదవికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. తనకు ఇన్నిరోజులు సహకరించిన దేశ ప్రజలకు, సహచర ప్రజాప్రతినిధులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న స్టార్మర్ కు రిషి శుభాకాంక్షలు తెలిపారు.
కన్జర్వేటివ్ పార్టీ ఓటమికి కారణాలివే :
బ్రిటన్ లో ఇప్పటివరకు ఏ పార్టీ వరుసగా 15 ఏళ్లకు పైగా పాలించింది లేదు. ఎంత గొప్పగా పాలించినా అక్కడి ప్రజలు ఐదోసారి ఏ పార్టీని గెలిపించిన దాకలాలు లేవు. ఇలా 1979 నుండి 1997 వరకు కన్జర్వేటివ్, 1997 నుండి 2010 వరకు లేబర్ పార్టీ అధికారంలో వుంది. 2010 లో తిరిగి కన్జర్వేటివ్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటివరకు పాలిస్తూ వచ్చింది... తాజా ఎన్నికల్లో మళ్ళీ కన్జర్వేటివ్ పార్టీ నుండి అధికారం లేబర్ పార్టీ చేతిలోకి వెళ్ళింది.
దశాబ్ద కాలంగా అధికారాన్ని చెలాయిస్తున్న కన్జర్వేటివ్ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ అస్థవ్యస్తంగా మారింది. అంతేకాకుండా ఈ ప్రభుత్వంలో అనేక కుంభకోణాలు బయటపడ్డాయి. దీంతో కన్జర్వేటివ్ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారు... కాబట్టి లేబర్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించారు.
ఇక రుషి సునక్ కు ముందు బ్రిటన్ ప్రధానులుగా కన్జర్వేటివ్ పార్టీ నాయకులు బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్ పరిచేసారు. వీరి హయాంలోనే పార్టీ పూర్తిగా దెబ్బతిందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. కన్జర్వేటివ్ పార్టీ ఓటమిలో రిషి సునక్ పాత్ర ఏమీ లేదని అభిప్రాయపడుతున్నారు.
బ్రిటన్ ఎన్నికల్లో భారతీయుల విజయం :
బ్రిటన్ ఎన్నికల ఫలితాల్లో భారత సంతతికి చెందిన రిషి సునక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయవడం బాధించే అంశమే. కానీ ఈ ఎన్నికల్లో ఏకంగా 26 మంది భారత సంతతి వారు గెలవడం ఆనందించే అంశమే. రిషి సునక్ తో సహా చాలామంది భారత సంతతి నాయకులు గెలుపొందారు. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే రిషి సునక్ కంటే ముందు బ్రిటన్ ప్రధానిగా చేసిన లిజ్ ట్రస్ ఓటమిపాలయ్యారు.