యూకే ప్రధాన మంత్రి పదవికి మంగళవారం సాయంత్రం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అనంతరం రూపొందించిన జాబితా ప్రకారం.. 8 మంది యూకే ప్రధాని రేస్‌లో నిలిచారు.
యూకే ప్రధాన మంత్రి పదవికి మంగళవారం సాయంత్రం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అనంతరం రూపొందించిన జాబితా ప్రకారం.. 8 మంది యూకే ప్రధాని రేస్‌లో నిలిచారు. అందులో ఇద్దరు భారత సంతతికి చెందిన ఇద్దరు.. బ్రిటన్ ఆర్థిక శాఖ మాజీ రిషి సునక్, అటార్నీ జనరల్ సుయోలా బ్రావెర్మన్‌లు చోటు దక్కించుకున్నారు. రిషి సునక్ ప్రధాని పదవి రేసులో ముందు వరుసలో కొనసాగుతున్నాడు. అతని వెనుక అత్యధిక సంఖ్యలో ఎంపీలు ఉన్నారు. మరోవైపు భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్ మాత్రం పోటీకి దూరంగా ఉంటున్నట్టుగా ప్రకటించారు.
ఇక, జాబితాలో నిలిచిన 8 మంది అభ్యర్థుల్లో విభిన్న మూలాలకు చెందిన వారు ఉన్నారు. ఎనిమిది మంది అభ్యర్థులలో బ్రిటీష్ మూలాలకు చెందిన నలుగురు.. మాజీ ఆరోగ్య, విదేశాంగ కార్యదర్శి జెరెమీ హంట్, వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డాంట్, ఫారిన్ అఫైర్స్ కమిటీ మాజీ ఛైర్మన్ టామ్ తుగెన్‌ధాట్, విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్‌లు ఉన్నారు. మిగిలిన నలుగురిలో భారత సంతతికి చెందిన ఇద్దరు(రిషి సునక్, బ్రావెర్మన్), నైజీరియా సంతతికి చెందిన కెమీ బాడెనోచ్, ఇరాక్‌లో జన్మించిన కుర్దిష్ మూలానికి చెందిన నదీమ్ జహావిలు ఉన్నారు. ఇక, యూకే ప్రధాని రేసులో నిలవాలనే అభ్యర్థి పేరును బ్యాలెట్ పేపర్‌లో చేర్చాలంటే కనీసం 20 ఎంపీల మద్దతు అవరసరం ఉంటుంది.
బరిలో నిలిచిన 8 మంది అభ్యర్థులు బుధవారం తొలి రౌండ్ ఓటింగ్‌ను ఎదుర్కొనున్నారు. ఇందులో కనీసం 30 మంది ఎంపీల మద్దతు ఉన్నవారు మాత్రమే గురువారం జరగనున్న రెండో రౌండ్‌కు చేరుకుంటారు. ఈ నెల 21 వరకు బరిలో చివరకు ఇద్దరు అభ్యర్థలు మాత్రమే మిగిలేలా తదుపరి రౌండ్లను నిర్వహిస్తారు. ఆ తర్వాత అభ్యర్థులు కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల ఓట్ల కోసం ప్రచారం నిర్వహించుకుంటారు.
మరోవైపు సెప్టెంబర్ 5వ తేదీన కన్జర్వేటివ్ పార్టీ యూకే నూతన ప్రధానిని ఎన్నుకోంది. కన్జర్వేటివ్ పార్టీ అధినేతగా ఎన్నికైనా వారే.. బ్రిట్ ప్రధానిగా బాధ్యతలు చేపడతారు. ఇక, రిషి సునక్ తన ప్రచార ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ.. ‘‘నా నాయకత్వం మా పార్టీకి, మన దేశానికి ఏమి అందించగలదనే దానిపై దృష్టి సారించి ప్రచారం సాగుతుంది’’ అని చెప్పారు. అయితే రిషి సునక్ యూకే ప్రధానిగా ఎన్నికైతే.. ఆ పీఠంపై కూర్చొన్న ఆసియాకు చెందిన తొలి వ్యక్తిగా నిలుస్తారు.
