బ్రిటన్ ప్రధాని బోరీస్ జాన్సన్ రాజీనామా చేయనున్నారు. ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేసేందకు అంగీకరించినట్టుగా బ్రిటన్ మీడియా పేర్కొంది.
బ్రిటన్ ప్రధాని బోరీస్ జాన్సన్ రాజీనామా చేయనున్నారు. ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేసేందకు అంగీకరించినట్టుగా బ్రిటన్ మీడియా పేర్కొంది. బోరిస్ జాన్సన్ గురువారం రోజున బ్రిటీష్ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేస్తారని బీబీసీ రిపోర్ట్ చేసింది. బోరీస్ జాన్సన్ రాజీనామా సంబంధించి కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక, బోరిస్ జాన్సన్ ప్రభుత్వం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. బోరిస్ జాన్సన్‌ను వరుస వివాదాలు చుట్టుముట్టడంతో.. గత కొన్ని రోజులుగా బోరిస్‌కు వ్యతిరేకంగా బ్రిటన్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఆయన ప్రధాన మంత్రి పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్లు వచ్చాయి. ఆయన నాయకత్వంపై విశ్వాసం కోల్పోయిన సొంతపార్టీ నేతలు రాజీనామాల బాట పట్టారు.
ప్రధానమంత్రి పదవి నుంచి జాన్సన్ వైదొలగాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఇద్దరు కేబినెట్ మంత్రులు రాజీనామా చేయగా బుధవారం మరో 15 మంది మంత్రులు వారితో జత కలిశారు. దౌత్యాధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా వరుస పెట్టి రాజీనామాలు చేస్తున్నారు. ఇలా 50 మందిపైగా రాజీనామాలు చేశారు. తనకు బ్రహ్మాండమైన మెజార్టీ ఉన్నదని, ప్రధాని సీటును వదిలిపెట్టాల్సిన అవసరం లేదని సమర్థించుకున్నారు. అయితే క్రమంగా పరిస్థితులు చేజారుతుండటంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో బోరిస్ జాన్సన్ రాజీనామా చేసేందుకు అంగీకరించారని మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
బ్రిటన్ ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్టు బోరిస్ జాన్సన్ ఈరోజు ప్రకటిస్తారని బీబీసీ తెలిపింది. కన్జర్వేటివ్ పార్టీ అధినేత పదవికి కూడా ఆయన రాజీనామా చేయనున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే కన్జర్వేటివ్ పార్టీ సమావేశంలో అధికారికంగా కొత్త నాయకుడిని నియమించే వరకు జాన్సన్ అపద్దర్మ ప్రధానమంత్రిగా కొనసాగనున్నారు.
