అమెరికాను  జార్జ్ ఫ్లాయిడ్  హత్య ఓ  కుదుపు కుదిపేసింది.  ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా దేశంలో పెద్ద ఎత్తున  నిరసనలు కొనసాగాయి. 

వాషింగ్టన్: అమెరికాను జార్జ్ ఫ్లాయిడ్ హత్య ఓ కుదుపు కుదిపేసింది. ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగాయి.ఫ్లాయిడ్ మృతికి మిన్నియా పోలీస్ మాజీ అధికారి డెరెక్ చౌవిన్ కారణమని కోర్టు తేల్చి చెప్పింది. ఈ కేసును 12 మంది సభ్యులున్న జ్యూరీ 10 గంటల పాటు విచారించింది. కోర్టు తీర్పు కోసం బయట ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడారు. తీర్పు వెలువడిన తర్వాత పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

జార్జ్ హత్య కేసులో డెరిక్ తో పాటు మరో ముగ్గురు పోలీసులపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ తీర్పు తర్వాత జార్జ్ కుటుంబసభ్యులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్,ఉపాధ్యక్షురాలు కమలా హరిస్ వైట్ హౌస్ కు పిలిపించి మాట్లాడారు.2020 మే 25 వ తేదీన ఓ దుకాణంలో నకిలీ నోట్లు సరఫరా చేశారనే ఆరోపణలతో ఫ్లాయిడ్ ను శ్వేతజాతి పోలీసు అధికారి డెరిక్ రోడ్డుపై పడుకోబెట్టి మెడపై కాలితో తొక్కిపెట్టారు. తనకు ఊపిరి ఆడడం లేదని ఫ్లాయిడ్ చెప్పినా పోలీస్ విన్పించుకోలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో అప్పట్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. ఈ ఘటనను నిరసిస్తూ నిరసన ప్రదర్శనలు కొనసాగాయి.