మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు సాధువులను గుర్తు తెలియని దుండగులు వారి ఆశ్రమంలోనే దారుణంగా హతమార్చారు. వివరాల్లోకి వెళితే.. నాందేడ్‌ జిల్లా ఉమ్రి తాలుకాలోని బాలబ్రహ్మచారి శివాచార్య ఆశ్రమం నడుపుతున్నారు.

ఈ క్రమంలో  ఆశ్రమంలోని వస్తువులను దోపిడీ చేయడానికి వచ్చిన కొందరు దుండగులు.. తమకు అడ్డొచ్చిన శివాచార్యను గొంతునులిమి హతమార్చారు. దీనికి కళ్లారా చూసిన ఆయన శిష్యుడు భగవాన్ షిండేని కూడా హత్య చేశారు.

Also Read:అనుమానం: అక్కతో తమ్ముడి అక్రమ సంబంధం, బావమరిది హత్య

సదరు దుండగులు ఆశ్రమంలో లక్షన్నర విలువ చేసే వస్తువులను దోపిడి చేశారు. అంతేకాకుండా శివాచార్య వినియోగించే కారు తాళాలను కూడా బలవంతంగా లాక్కున్నట్లుగా పోలీసులు  వెల్లడించారు.

దోపిడీ చేసిన వస్తువుల్లో 69 వేల రూపాయల విలువైన లాప్‌టాప్‌ కూడా ఉంది. కారులో పారిపోతుండగా, అది ఆశ్రమం గేటు వద్దే ఆగిపోయిందని.. మిగిలిన శిష్యులు, ఇతర సిబ్బంది వచ్చేసరికి దుండగులు ద్విచక్ర వాహనంలో పారిపోయినట్లుగా తెలుస్తోంది.

Also Read:ప్రేమ ప్రపోజల్ నిరాకరించిందని.. రూ.3లక్షల సుపారీ ఇచ్చి..

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దోపిడీ, హత్య క్రమాన్ని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి సాయినాథ్ శింగాడే అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో భాగస్వామ్యం ఉన్న నిందితుల కోసం  పోలీసులు ప్రత్యేక బృందాల సాయంతో గాలిస్తున్నారు.

కాగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన శివాచార్య కొన్నేళ్ల క్రితమే నాందేడ్ వచ్చారు. ఇక్కడ ఓ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. మరోవైపు మహారాష్ట్రలోనే  కొద్దిరోజుల క్రితం పాల్గర్ జిల్లాలో ఇద్దరు సాధువులను  స్థానికులు కర్రలు, రాళ్లతో దారుణంగా కొట్టిచంపిన ఘటన మరవక ముందే ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది.