అతను ఆ యువతిని గాఢంగా ప్రేమించాడు. ఇదే విషయాన్ని సదరు యువతికి కూడా చెప్పాడు. అయితే.. అతని ప్రపోజల్ ని ఆమె అంగీకరించలేదు.  ఇంకెవరైనా అయితే.. తన ప్రేమకాదు అన్నదని మద్యానికి బానిస కావడం లాంటివి చేస్తారు. అయితే.. ఇతను మాత్రం కోపం పెంచుకున్నాడు.  తన ప్రేమను కాదు అన్నందుకు చంపేయాలని భావించాడు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఎం నాగులాపల్లికి చెందిన యువతిని సత్యదేవ్‌ అనే యువకుడు ప్రేమ పేరుతో గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. సత్యదేవ్‌ ప్రేమని ఆ యువతి  నిరాకరించడంతో తన స్నేహితులతో కలిసి హత్య చేయడానికి ప్లాన్‌ సిద్ధం చేశాడు. ఏలూరుకు చెందిన కొత్తపల్లి సురేష్‌తో కలిసి రూ.3 లక్షల సుపారీతో ఆ యువతి హత్యకు డీల్‌ కుదుర్చుకున్నాడు. 

అందులో భాగంగా అడ్వాన్స్‌ కింద రూ.40 వేలు తీసుకుంటున్న క్రమంలో ముగ్గురు నిందితుల్ని ద్వారకా తిరుమల పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.