ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. తన భార్యతో ఆమె తమ్ముడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అనుమానించిన ఓ వ్యక్తి అమానుషమైన చర్యకు ఒడిగట్టాడు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానించి బావమరిదిని ఓ వ్యక్తి హత్య చేశాడు. 

ప్రకాశం జిల్ాలలోని నిమ్మారెడ్డిపాలెంలో 12వ తేదీ రాత్రి 11.30 గంటల సమయంలో పోకూరి రామస్వామి (55)ని ముఖంపై కొట్టి దారుణంగా చంపిన కేసును దర్శి పోలీసులు ఛేదించారు. డీఎస్పీ ప్రకాశరావు ఈ కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. 

నిమ్మారెడ్డిపాలెం గ్రామానికి చెందిన పోకూరి రామస్వామి అక్కను దామా సుబ్బారావు అనే వ్యక్తి వివాహం చేసుకున్నాడు. రామస్వామి ఏడాదిన్నర క్రితం కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టిన సమయంలో భూమి పూజలకు బంధువులు వచ్చారు. ఇంట్లో మంచాలు లేకపోవడంతో అంతా సుబ్బారావు ఇంట్లోకి వెళ్లి పడుకున్నారు. 

ఆ సమయంలో సొంత అక్క పక్కన ఆమె సోదరుడు రామస్వామి పడుకుని ఉండడాన్ని భర్త సుబ్బారావు చూసి అనుమానించాడు. తన భార్యకు తమ్ముడితో అక్రమ సంబంధం ఉందని అనుమానం పెంచుకున్నాడు. ఈ నెల 12వ తేదీ రాత్రి తన గొర్రెల దొడ్డి వద్ద రామస్వామి ఒంటరిగా పడుకుని ఉండడాన్ని గమనించిన సుబ్బారావు రోకలి బండతో ముఖంపై కొట్టి హత్య చేశాడు. ఆ రోజు నుంచి అతను పరారీలో ఉన్నాడు. 

చివరకు శుక్రవారంనాడు గ్రామ వీఆర్వో బండారు శ్రీనివాసరావు ముందు లొంగిపోయాడు. వీఆర్వో నిందితుడిని సిఐ మహమూద్ మొయిన్ ముందు హాజరు పరిచాడు. సుబ్బారావు రామస్వామిని హత్య చేసేందుకు ఉపయోగించిన రోకలి బండను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.