శిక్షణలో ఉన్న రెండు విమానాలు ఆకాశంలో ప్రయాణిస్తుండగా ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. ఈ ఘటన దక్షిణ కొరియాలో జరిగింది.
దక్షిణ కొరియాకు చెందిన రెండు వైమానిక దళ విమానాలు గగనతలంలో శుక్రవారం ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరొకరికి గాయాలు అయ్యాయి. ఈ ఘటనను దక్షిణ కొరియా వైమానిక దళం శుక్రవారం అధికారికంగా వెల్లడించింది.
శిక్షణ సమయంలో ఈ విమాన ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. రెండు KT-1 ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఒకదానిని ఒకటి ఢీకొట్టుకున్నాయని, దీంతో అవి ఆగ్నేయ నగరం సచియోన్‌లోని పర్వతంపై కూలిపోయినట్లు చెప్పారు.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే 30 మంది అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారని, రక్షణ చర్యలు చేపడుతున్నారని దక్షిణ కొరియాకు చెందిన యోన్‌హాప్ వార్తా సంస్థ తెలిపింది. ఈ రక్షణ చర్యలు చేపట్టేందుకు మూడు హెలికాప్టర్లు, 20 వాహనాలు అక్కడికి చేరుకున్నాయి.
అయితే ఇంకా ప్రాణనష్టాన్ని నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నామని వైమానిక దళం ప్రకటించింది. విమానంలోని పైలట్లు సురక్షితంగా బయటకు వెళ్లడానికి ప్రయత్నించారా లేదా అనేది తెలుసుకుంటున్నామని పేర్కొంది. KT-1 అనే విమానం రెండు సీట్లు ఉంటాయని చెప్పింది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
